సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఓటరు తుది జాబితా కూడా శుక్రవారం వెలువడుతున్నందున ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’అని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు.
మంత్రులు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మొదలుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి పలుమార్లు మంత్రులు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
‘గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్లవారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే డివిజన్లవారీగా పార్టీ ఇన్‌చార్జీల జాబితా కూడా సిద్ధం చేశాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ పటిష్ట స్థితిలో ఉన్నట్లు అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’అని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావించడంతో పాటు టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నగర అభివృద్దిని సుదీర్ఘంగా నేతలకు వివరించారు.
బెంబేలు పడాల్సిన అవసరం లేదు
‘దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి అధైర్యపడొద్దు. గాలివాటు గెలుపును చూసి గాభరా చెందాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైన పార్టీ యం త్రాంగం, బలమైన నేతలు ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్దాం. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలి తాల మాదిరిగానే ఈ దఫా కూడా పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాం. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.60వేల కోట్లకు పైగా నిధులను ఐదేళ్లలో ఖర్చు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఇన్‌చార్జీలు కీలకంగా వ్యవహరించాలి. డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయంపై ఇన్‌చార్జీలు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది’అని మంత్రులు, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం వివరించినట్లు సమాచారం.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని.. ఎవరికీ మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టంచేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేదిగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘అభూతకల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థులు, నాయకుల వ్యక్తిత్వం కించపరిచేలా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. అ దిశగా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ
శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, శాసనమండలి రెండు పట్టభద్రుల కోటా స్థానాల్లో ఓటరు నమోదు జరిగిన తీరును కూడా సీఎం కేసీఆర్ గురువారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా దిశానిర్దేశం చేశారు. అలాగే ధరణి పోర్టల్, సన్నరకం వడ్లు తదితర అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మరోవైపు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోణంలో ఈ భేటీ జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దుబ్బాకపై సీఎంకు హరీశ్ నివేదిక..
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గురువారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన, సమీక్ష చేయలేదని సమాచారం. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను ఒంటిచేత్తో నిర్వహించిన ఆర్దికశాఖ మంత్రి హరీశ్‌రావు.. సమావేశం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలను సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక మొదలు పార్టీ పరంగా జరిగిన ప్రచారం, విపక్షాలు.. ప్రత్యేకించి బీజేపీ అనుసరించిన విధానాలు, స్థానిక పరిస్థితులు తదితరాలపై సీఎంకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment