
'సీఎం సీటు కోసం ఇంత దిగుజారుడుతనమా?'
అమలాపురం : నాలుగు నెలలు ఉండే పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఇంత దిగుజారుడుతనమా? అనిపిస్తోందని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఈ పరిణామాలు అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైనతేయ నదిపై నిర్మించిన వంతెనపై నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. బీజేపీ కూడా నిలువునా ముంచిందని విమర్శించారు.
విభజనపై తొలుత కొన్ని షరతులు పెట్టినట్టు నటించి, సీమాంధ్రులను నమ్మించే ప్రయత్నం చేసిన ట్టే చేసి చీకటి ఒప్పందాలతో సిగ్గుమాలిన పని చేసిందన్నారు. ఈ రెండు పార్టీలూ ఏకమైన తీరు చూస్తుంటే దేశంలో ఏ రాష్ట్రాన్నైనా సీట్లు, ఓట్ల కోసం విడదీస్తారన్న ఆందోళన కలుగుతోందని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కొత్త పార్టీ పెట్టాలని బహిష్కృత ఎంపీలందరం కోరుతున్నామని, అయితే ఆయన ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని చెప్పారు. విభజన విషయంలో అన్ని పార్టీలతో పాటు ఎంపీలుగా తాము కూడా పూర్తిగా విఫలమయ్యామని హర్షకుమార్ అంగీకరించారు.