పార్టీ టికెట్ కోసం పైరవీలు..రాజధాని చుట్టూ ప్రదక్షిణలు..సీటు ఖరారయ్యేంత వరకు హైరానా..ఇదంతా కాంగ్రెస్ పార్టీ గత వైభవం. ఇప్పుడు పరిస్థితి దయనీయం. జిల్లాలో ఈ పార్టీ ఖాళీ అయిపోతోంది. రాష్ట్ర విభజన ఆగ్రహానికి గురయి నేతలను దూరం చేసుకుంటోంది. పార్టీ జెండా మోసే నాథుడే కరువయ్యే పరిస్థితికి చేరుకుంది.
విశాఖపట్నం: ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఖాళీ అయిపోయింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పార్టీని వదలి వెళ్లిపోతుండడంతో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర విభజన పట్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండడం. అందుకు కాంగ్రెస్ అధిష్టానం కారణంగా కావడంతో నేతలంతా తమ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే విశాఖ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురందేశ్వరి, అనకాపల్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ శాననసభ్యులు తైనాల విజయకుమార్, ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి (కన్నబాబు)లు పార్టీకి రాజీనామాలు సమర్పించారు.
ఎంఎల్‌సీ సూర్యనారాయణరాజ కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పార్టీని వీడి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పెట్టే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌కు బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో, గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని అధికార కాంగ్రెస్ ఎదుర్కోనుంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతల్లో నేతల్లో మాజీ మంత్రి బాలరాజు , విశాఖ దక్షిణ నియోజక వర్గ శానన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌లు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగేట్లు కనిపిస్తోంది. మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులు మళ్ల విజయప్రసాద్, బోళెం ముత్యాలపాప ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే దృష్టి సారించారు. దీంతో కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండా మోసే నాథుడే కరవయ్యాడు. గతంలో కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉన్నా నియోజక వర్గ స్దాయి నేతలకు కొదవ ఉండేది కాదు.
ఇప్పడు కాంగ్రెస్ పేరు చెబితే చాలు జనం ఛీత్కరించే పరిస్ధితులు నెలకొనడంతో చెప్పుకోదగ్గ స్థాయి ఉన్న నేతలు కూడా కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న వారు వైఎస్సార్ కాంగ్రెస్‌కు తొలిప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ అవకాశం లేకపోతే టీడీపీ, బీజేపీల వైపు చూస్తున్నారు. గంటా బృందం టీడీపీ తీర్ధం పుచ్చుకోగా, పురందేశ్వరి బీజేపీలోకి వెళుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది మరిన్ని వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని నియోజక వర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలకూ కొరత తప్పదని కాంగ్రెస్ పెద్దలు భయపడుతున్నారు.