హవాలా రాకెట్‌తో చతుర్లుకాదు!
హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేసిన హవాలా రాకెట్ వ్యవహారాన్ని ఆర్థిక నేరాల ప్రత్యేక దర్యాప్తు విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) లోతుగా ఆరా తీస్తోంది. ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దుబాయ్ కేంద్రంగా లావాదేవీలు నడుపుతున్నట్లు బయటపడటంతో అండర్‌వరల్డ్ లింకులపై ప్రధానంగా దష్టి పెట్టింది. దర్యాప్తులో భాగంగా ఈడీ సోమ, మంగళవారాల్లో నగరంలోని విజయ్‌నగర్ కాలనీ, మెదక్ జిల్లాలోని పటాన్‌చెరులతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న హీరా గ్రూప్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. వీటిలోని లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న సంస్థ సీఈఓ షేక్ నౌహీరాతో పాటు రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు.
పన్ను ఎగ్గొట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల కోసం దేశంలో అంతర్గతంగా జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హుండీ అని, రెండు దేశాల మధ్య జరిగే దాన్ని హవాలా అని అంటారు. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న హీరా గ్రూప్ బంగారం, వస్త్రాలు తదితర వ్యాపారాల ముసుగులో హవాలా వ్యాపారం చేస్తోందని ఈడీ గుర్తించిది. ముంబైకు చెందిన పటేల్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్ దీనికి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. గుజరాత్‌లోని పలు సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న హీరా గ్రూప్ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తోంది. హీరా, పటేల్ సంస్థలకు చెందిన ఆరుగురు వ్యక్తులు రూ.84.75 లక్షల నగదును దుబాయ్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన నార్త్‌జోన్ టీమ్ శనివారం పట్టుకుంది. ఈ నిందితుల విచారణలోనే నౌహీరా పేరు వెలుగులోకి వచ్చింది.
గతంలోనే ఈ సంస్థ పలు మోసాలకు పాల్పడుతోందని ఫిర్యాదులు ఉన్నాయని, ఈడీ సైతం అక్రమ ద్రవ్యమార్పిడి, విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా హవాలా సొమ్ము చిక్కడంతో ఈడీ సైతం దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్ని పరిశీలిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు నౌహీరాను అరెస్టు చేయడం కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేయాలని నిర్ణయించారు. భారత్-దుబాయ్‌ల మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉండటంతో ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురూ కేవలం పాత్రధారులు మాత్రమే కావడంతో సూత్రధారులు చిక్కితేనే ఈ హవాలా రాకెట్‌కు, అండర్‌వరల్డ్‌కు ఉన్న లింకులు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఈ అక్రమ ద్రవ్యమార్పిడిలో హీరా గ్రూప్‌నకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ముంబైలోని పటేల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ పైనా దాడులు చేయడానికి ఈడీ సిద్ధమౌతోంది.