బధిరులకు పరీక్ష చేసే మెషీన్
సాక్షి, విజయనగరం: పట్టణంలోని ఘోషాస్పత్రిలో మెషీన్లు పనిచేయక బధిర (చెవిటి) బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ పొందేందుకు ధ్రువపత్రం ఇవ్వాలని బాధితులు నెలల తరబడి తిరుగుతున్నా.. మెషీన్లు పని చేయడం లేదంటూ ఆస్పత్రి సిబ్బంది పింపించివేస్తున్నారు. విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ గంగాదేవి అనే మహిళకు గత కొన్నేళ్లుగా వినికిడి సమస్య ఉంది. దీంతో సదరం ధ్రువపత్రం కోసం ఆమె కేంద్రాస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు వినికిడి దోషాన్ని నిర్ధారించేందుకు ఘోషాస్పత్రిలోని సత్వర చికిత్స కేంద్రంలో పరీక్ష చేయించుకు రావాలని సూచించారు.
రెండు నెలలు క్రితం కేంద్రాస్పత్రి ఈఎన్‌టీ వైద్యులు రాసి ఇచ్చిన చీటీ పట్టుకుని వెళ్తే మెషీన్ పాడైంది, బాగు చేసిన తర్వాత ఫోన్ చేస్తామని అక్కడ సిబ్బంది చెప్పి పంపారు. రెండు నెలలుగా అధికారులు మెషీన్‌ను బాగు చేయించకపోవడంతో ఆమె సదరం ధ్రువపత్రం పొందలేకపోయింది. అలాగే జామి మండలం కుమరాం గ్రామానికి చెందిన లగుడు కిరణ్ అనే యువకుడికి పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్యతో పాటు సరిగా మాట్లాడలేడు. దీంతో కేంద్రాస్పత్రికి 15 రోజులు క్రితం వెళ్లగా, పరీక్ష నిమిత్తం ఘోషాస్పత్రికి వెళ్లమని చెప్పారు. అక్కడ సిబ్బంది మెషీన్ పని చేయడం లేదని చెప్పి పంపించి వేశారు.
బాధితుల అవస్థలు
పైన చెప్పిన ఇద్దరే కాక, అనేక మంది దివ్యాంగులు ఘోషాస్పత్రిలో మెషీన్ పని చేయకపోవడంతో సదరం ధ్రువపత్రం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మెషీన్ పాడై నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సదరం ధ్రువపత్రం ఉంటేగాని పింఛన్ మంజూరు కాని పరిస్థితుల్లో బధిర బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజుల్లో బాగుచేయిస్తాం..
రెండు నెలల క్రితం మెషీన్ పాడైంది. ఈ విషయాన్ని మెషీన్‌ను కొనుగోలు చేసిన కంపెనీకి తెలియజేశాం. వారం రోజుల్లో మెషీన్ బాగవుతుంది.
– డాక్టర్ సుబ్రమణ్యం, ఆర్‌బీఎస్‌కే కో– ఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment