vizianagaram government hospital
-
మా ‘ఘోష’ వినేదెవరు?
సాక్షి, విజయనగరం: పట్టణంలోని ఘోషాస్పత్రిలో మెషీన్లు పనిచేయక బధిర (చెవిటి) బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ పొందేందుకు ధ్రువపత్రం ఇవ్వాలని బాధితులు నెలల తరబడి తిరుగుతున్నా.. మెషీన్లు పని చేయడం లేదంటూ ఆస్పత్రి సిబ్బంది పింపించివేస్తున్నారు. విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ గంగాదేవి అనే మహిళకు గత కొన్నేళ్లుగా వినికిడి సమస్య ఉంది. దీంతో సదరం ధ్రువపత్రం కోసం ఆమె కేంద్రాస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు వినికిడి దోషాన్ని నిర్ధారించేందుకు ఘోషాస్పత్రిలోని సత్వర చికిత్స కేంద్రంలో పరీక్ష చేయించుకు రావాలని సూచించారు. రెండు నెలలు క్రితం కేంద్రాస్పత్రి ఈఎన్టీ వైద్యులు రాసి ఇచ్చిన చీటీ పట్టుకుని వెళ్తే మెషీన్ పాడైంది, బాగు చేసిన తర్వాత ఫోన్ చేస్తామని అక్కడ సిబ్బంది చెప్పి పంపారు. రెండు నెలలుగా అధికారులు మెషీన్‌ను బాగు చేయించకపోవడంతో ఆమె సదరం ధ్రువపత్రం పొందలేకపోయింది. అలాగే జామి మండలం కుమరాం గ్రామానికి చెందిన లగుడు కిరణ్ అనే యువకుడికి పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్యతో పాటు సరిగా మాట్లాడలేడు. దీంతో కేంద్రాస్పత్రికి 15 రోజులు క్రితం వెళ్లగా, పరీక్ష నిమిత్తం ఘోషాస్పత్రికి వెళ్లమని చెప్పారు. అక్కడ సిబ్బంది మెషీన్ పని చేయడం లేదని చెప్పి పంపించి వేశారు. బాధితుల అవస్థలు పైన చెప్పిన ఇద్దరే కాక, అనేక మంది దివ్యాంగులు ఘోషాస్పత్రిలో మెషీన్ పని చేయకపోవడంతో సదరం ధ్రువపత్రం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మెషీన్ పాడై నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సదరం ధ్రువపత్రం ఉంటేగాని పింఛన్ మంజూరు కాని పరిస్థితుల్లో బధిర బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో బాగుచేయిస్తాం.. రెండు నెలల క్రితం మెషీన్ పాడైంది. ఈ విషయాన్ని మెషీన్‌ను కొనుగోలు చేసిన కంపెనీకి తెలియజేశాం. వారం రోజుల్లో మెషీన్ బాగవుతుంది. – డాక్టర్ సుబ్రమణ్యం, ఆర్బీఎస్కే కో– ఆర్డినేటర్ -
చికిత్స కరువు..!
విజయనగరం ఫోర్ట్ : సీతానగరం మండలం చల్లవానివలస గ్రామానికి చెందిన చందాన కృష్ణ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరంతో కేంద్రాస్పత్రిలో చేరాడు. ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో డెంగీ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ మూడు రోజుల్లో ఒకసారి మాత్రమే వైద్యులు రోగిని పరీక్షించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వైపు డెంగీ జ్వరం, మరోవైపు వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగి ఆందోళన చెందుతున్నాడు. మూడు రోజులు క్రితం విజయనగరం పట్టణానికి చెందిన తిలారి వేదశ్రీ అనే 6 ఏళ్ల బాలిక జ్వరంతో బాధపడుతూ కేంద్రాస్పత్రికి వస్తే వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇంటికి పంపించేశారు. మరుసటి రోజు జ్వరం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ బాలికను కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు. బాలికను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికి మృతి చెందింది.ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరికే దాపురించ లేదు. జిల్లా నలుమూలల నుంచి కేంద్రాస్పత్రికి వస్తున్న చాలా మంది రోగులకు ఎదురవుతుంది. జిల్లాలో పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో నలుమూలల నుంచి ఇక్కడికి రోగులు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిక్సిత చేయకుండా తప్పించుకోవడానికి, రిఫర్ చేయడానికే వైద్యులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. వీటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జ్వర పీడితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేంద్రాస్పత్రిలో వైద్యులు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సకాలంలో అందని వైద్య సేవలు.. జ్వరాలు రావడం, వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాస్పత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ఓ వైపు వైద్యాధికారులు గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో సంఘటన జరిగినప్పుడు తప్ప పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగం వచ్చి చికిత్స కోసం వచ్చిన వారిలో చాలా మందికి చికిత్స చేసే అవకాశం ఉన్నప్పటికీ రిఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా, ఉన్నతాధికారులు స్పందించడం లేదని వినికిడి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు.. కేంద్రాస్పత్రిలో సకాలంలో వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడే చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వదులుతాయని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రుల యజమాన్యాలు ప్లేట్లెట్లు తగ్గాయని చెబుతూ రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్పించి, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యశాఖ, వైద్యులు అంతగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారిస్తాం.. జ్వర పీడితులకు చికిత్స అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. – కె.సీతారామరాజు, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : అశోక్‌గజపతిరాజు
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రిలో రూ.1.50 కోట్లతో ఆధునికరించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక మార్చురీకి కూడా అశోక్‌గజపతిరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు గతంలో కంటే మెరుగయ్యాయని చెప్పారు. ఇదే స్పూర్తితో ఇక ముందు పని చేయాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. దేశంలోని ప్రతి ఎయిర్‌పోర్టులో సోలార్ విద్యుత్ వినియోగిస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని ఆయన చెప్పారు. హోదా ఆలస్యమైన కొద్దీ రాష్ట్రానికి మరిన్ని ఆర్థిక కష్టాలు తప్పవని అశోక్ గజపతిరాజు చెప్పారు. -
విజయనగరం ఆసుపత్రిలో కామినేని తనిఖీలు
విజయనగరం: విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలైనా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కామినేని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కామినేని పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను కామినేని అడిగి తెలుసుకున్నారు.