విజయనగరం : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రిలో రూ.1.50 కోట్లతో ఆధునికరించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక మార్చురీకి కూడా అశోక్గజపతిరాజు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు గతంలో కంటే మెరుగయ్యాయని చెప్పారు. ఇదే స్పూర్తితో ఇక ముందు పని చేయాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. దేశంలోని ప్రతి ఎయిర్పోర్టులో సోలార్ విద్యుత్ వినియోగిస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని ఆయన చెప్పారు. హోదా ఆలస్యమైన కొద్దీ రాష్ట్రానికి మరిన్ని ఆర్థిక కష్టాలు తప్పవని అశోక్ గజపతిరాజు చెప్పారు.