'నాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు'
న్యూఢిల్లీ: రాష్ట్రాధికారాలను గవర్నర్ హరిస్తున్నారని భావిస్తే కోర్టుకు వెళ్లొచ్చని తెలంగాణ ప్రజాప్రతినిధులకు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సూచించారు. విభజన బిల్లులో ఉన్న అంశాలనే కేంద్రం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో అశోక్గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాసయ్యే క్రమంలో టీఆర్ఎస్ ఎందుకు ఆనాడు అభ్యంతరం తెలపలేదని తెలంగాణ ప్రతినిధులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఉమ్మడి రాజధాని కావడం వల్లే గవర్నర్కు అధికారులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ సర్వే అంతా గందరగోళమని ఆయన ఆరోపించారు. 1956 స్థానికత అనడం సమంజసం కాదని అన్నారు. ఎవరు ఎక్కడ పుడితే అక్కడే వారు స్థానికులవుతారని అశోక్గజపతిరాజు అభిప్రాయపడ్డారు. బేగంపేట విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ చేయలేమని స్పష్టం చేశారు. అలా చేస్తే తెలంగాణకు పెట్టుబడుదారులు ఎవరూ రారని అన్నారు. వైజాగ్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.