చికిత్స కరువు..! | Doctor Negligence In Vizianagaram | Sakshi
Sakshi News home page

చికిత్స కరువు..!

Published Mon, Aug 27 2018 12:41 PM | Last Updated on Mon, Aug 27 2018 12:41 PM

Doctor Negligence In Vizianagaram  - Sakshi

కేంద్రాస్పత్రి   

విజయనగరం ఫోర్ట్‌ : సీతానగరం మండలం చల్లవానివలస గ్రామానికి చెందిన చందాన కృష్ణ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరంతో కేంద్రాస్పత్రిలో చేరాడు. ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో డెంగీ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ మూడు రోజుల్లో ఒకసారి మాత్రమే వైద్యులు రోగిని పరీక్షించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వైపు డెంగీ జ్వరం, మరోవైపు వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగి ఆందోళన చెందుతున్నాడు.

మూడు రోజులు క్రితం విజయనగరం పట్టణానికి చెందిన తిలారి వేదశ్రీ అనే 6 ఏళ్ల బాలిక జ్వరంతో బాధపడుతూ కేంద్రాస్పత్రికి వస్తే వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇంటికి పంపించేశారు. మరుసటి రోజు జ్వరం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ బాలికను కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు. బాలికను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికి మృతి చెందింది.ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరికే దాపురించ లేదు. జిల్లా నలుమూలల నుంచి కేంద్రాస్పత్రికి వస్తున్న చాలా మంది రోగులకు ఎదురవుతుంది.

జిల్లాలో పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో నలుమూలల నుంచి ఇక్కడికి రోగులు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిక్సిత చేయకుండా తప్పించుకోవడానికి, రిఫర్‌ చేయడానికే వైద్యులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. వీటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జ్వర పీడితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేంద్రాస్పత్రిలో వైద్యులు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.

సకాలంలో అందని వైద్య సేవలు..

జ్వరాలు రావడం, వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాస్పత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ఓ వైపు వైద్యాధికారులు గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో సంఘటన జరిగినప్పుడు తప్ప పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగం వచ్చి చికిత్స కోసం వచ్చిన వారిలో చాలా మందికి చికిత్స చేసే అవకాశం ఉన్నప్పటికీ రిఫర్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా, ఉన్నతాధికారులు స్పందించడం లేదని వినికిడి.

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు.. 

కేంద్రాస్పత్రిలో సకాలంలో వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడే చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వదులుతాయని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రుల యజమాన్యాలు ప్లేట్‌లెట్లు తగ్గాయని చెబుతూ రోగులను ఇన్‌ పేషెంట్లుగా చేర్పించి, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యశాఖ, వైద్యులు అంతగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విచారిస్తాం.. 

జ్వర పీడితులకు చికిత్స అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. 

– కె.సీతారామరాజు, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement