ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో టీడీపీ నేతల జోక్యం పెరిగిపోరుుందని అధికారులు వాపోతున్నారు. వారు చెప్పిన పనులు చేస్తే ఒక ఇబ్బంది.. చేయకపోతే మరో ఇబ్బంది అని సతమతమవుతూ సెలవులో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్.. ఏంపీడీఓ.. పోలీస్‌స్టేషన్.. వ్యవసాయ శాఖ కార్యాలయం ఇలా.. ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై టీడీపీ నేతల పెత్తనం పెరిగిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యాలయంలో ప్యూన్ నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఎవరు ఏపని చేసినా తమకు తెలిసే జరగాలని హుకుం జారీ చేస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అన్నీ తాము చెప్పినట్టే జరగాలని పట్టుబట్టి మరీ చేయించుకుంటున్నారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘మాట వింటే ఉండు.. లేకపోతే లీవ్‌పెట్టు.. కాదు కూడదంటే బదిలీ చేయించుకో..’ అనే మాట వినని అధికారి ధర్మవరం నియోజకవర్గంలో లేరంటే అతిశయోక్తికాదు.
అంతటా డామినేషనే!
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి దాకా ఉన్న చౌక డీలర్లను తొలగించి వారి స్థానంలో ఆ పార్టీ కార్యకర్తలను నియమించుకున్నారు. దీంతో అప్పటి దాకా పనిచేసిన డీలర్లు కోర్టుకు వెళ్లగా హైకోర్టు వారికి స్టే మంజూరు చేసింది. పాత వారినే కొనసాగించాలని రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవిన్యూ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు పాత డీలర్లకే తిరిగి చౌకడిపోలను కేటాయించారు.
అధికారం ఉండి కూడా స్టోర్లను దక్కించుకోలేకపోయామని భావించిన టీడీపీ నేతలు.. రెవిన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్య నాయకుడికి చెప్పడంతో ఆయన రెవిన్యూ అధికారిని తీవ్ర స్థాయిలో మందలించి లీవ్ పెట్టమని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు రెవిన్యూ అధికారి లీవ్‌పెట్టి వెళ్లిపోయాడు. తాము చెప్పిన మాట వినలేదన్న కారణంతో మున్సిపల్ ఉన్నతాధికారిని బలవంతగా లీవ్‌లో పంపారు. ఇప్పటికే చాలా శాఖల్లోకి వారు కోరుకున్న అధికారులను తెచ్చి పెట్టుకున్నారు. దీంతో టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఉన్న చాలా మంది అధికారులు.. ఎవరైనా ఏదైనా పని చేసిపెట్టండని వస్తే.. ఫలానా నాయకుడి వద్దకు వెళ్లి చెప్పించండని ఉచిత సలహా ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఇక పోలీస్ స్టేషన్లలో అయితే వారి హవా చెప్పనలవి కాదు. చిన్న చిన్న వివాదాలను సైతం పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లి ఇరు వర్గాల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, అన్నదమ్ముల మధ్య వివాదాలు తదితర వాటిని నేరుగా స్టేషన్లకు తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. ‘వారే ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించారు.. ఏమైనా అంటే మళ్లెక్కడికి బదిలీ చేయిస్తారో’ అని పోలీసు అధికారులు కూడా ‘మింగలేక.. కక్కలేక’ అన్న చందంగా సతమతమవుతున్నారు.
చెప్పినట్లు విను.. లేదంటే లీవ్ పెట్టు!
Published Fri, Dec 26 2014 3:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement