మాతృ దేవతకు మదిలోనే ఆలయం
అనంతపురం కల్చరల్/రాప్తాడు :
మాతృ దేవతకు మదినే ఆలయం చేసి ప్రతిష్ఠించాలని దత్తపీఠం నుంచి విచ్చేసిన విజయానంద తీర్థులు ఉద్బోధించారు. జయలక్ష్మీ మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో మార్గదర్శనం చేసేం దుకు అనంతకు విచ్చేసిన స్వామీజీ బుధవారం అనుగ్రహ భాషణం చేశారు.
రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామం సచ్చిదానందాశ్రమంలో ఉద యం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామీజీ మాతృ స్వరూప ఔచిత్యంపై ప్రసంగిం చారు. ఈ సమయంలో స్వామీజీ ఉద్విగ్నతకు లోనై కంటతడి పెట్టారు. ‘అనంత’లో దివ్యశక్తిగా గణపతి సచ్చిదానంద స్వామీజీ అవతరించడం, తాను పుట్టిన బొమ్మేపర్తి గ్రామం జయలక్ష్మీపురంగా ప్రసిద్ధి చెందడం వెనుక స్వామీజీ మహిమాన్విత శక్తి దాగుందన్నారు. స్వామీజీ అవధూత స్వరూపులని, ఆయన చేపడుతున్న దత్తాత్రేయ సంప్రదాయానికి అందరూ వారసులు కావాలని సూచించారు.
గురువారం జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠలో, జయలక్ష్మీ నరసింహ తీర్థుల కల్యాణ మహోత్సవంలో పాల్గొని పునీతులు కావాలని సూచించారు. అంతకుముందు ఆశ్రమంలో విజయానంద తీర్థుల ఆధ్వర్వంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం యాగశాల ప్రవేశం, పీఠ పూజలు, దీక్షా హోమం, బ్రహ్మ కలళ దేవతా హోమం, మూలమంత్ర హోమాలు జరిగాయి. సాయంత్రం మండల దేవతా హోమాలతోపాటు, కళావాసనమ్, నీరాజన మంత్ర పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
నగరంలోని సచ్చిదానంద ఆశ్రమంలో కూడా ప్రత్యేక పూజోత్సవాలు, తీర్థప్రసాద వినియోగం జరిగాయి. భక్తులతో ఆశ్రమ ప్రాంగణం కిటకిటలాడింది. విదేశీ భక్తులు నియమనిష్టలతో భారతీయ సంప్రదాయాలను ఆచరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.