పండుగకు వెళుతూ పరలోకానికి..
నర్సీపట్నం: సంక్రాంతి పండుగ తమ జీవితాల్లో కొత్త కాంతులు నింపుతుందని ఆశించిన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సంక్రాంతి పండుగకు కన్నవారి ఇంటికి బయలుదేరిన తల్లీబిడ్డలను ఆర్టీసీ బస్సు రూపంలో మత్యువు కబళించింది. గొలుగొండ మండలం చీడిగుమ్మల పంచాయతీ శివారు ఎరకంపేట గ్రామానికి చెందిన నంబారు సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి మాకవరపాలెం మండలం వెంకటాపురం గ్రామం వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బుధవారం బయలుదేరారు. భార్య లోవలక్ష్మి, ఏడాది కుమార్తె జ్వాల, మూడేళ్ల కుమారుడు పార్థు అంతా ఒకే బైక్‌పై బయలుదేరారు.
నర్సీపట్నం అయ్యప్ప రైస్ మిల్లు సమీపంలోకి రాగానే నర్సీపట్నం నుండి ఏలేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోవలక్ష్మితో పాటు ఆమె ఒడిలో ఉన్న పార్థు అక్కడికక్కడే మృతిచెందారు. బాలుడు బస్సు టైర్ కింద నలిగి రెండు ముక్కలు కావడం కలిచివేసింది. సత్యనారాయణ, చిన్నారి జ్వాల స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అంతవరకు ముద్దుముద్దుగా మాట్లాడి..
తన వెనకే కూర్చుని తల్లి ఇంటికి వెళ్లే సంతోషంలో ఉన్న భార్య, ముద్దుముద్దు మాటలతో మురిపించిన మూడేళ్ల చిన్నారి క్షణకాలంలోనే నిర్జీవులు మారడం చూసి సత్యనారాయణ గుండెలు బాదుకొని రోదించడం అందరినీ కంటతడిపెట్టించింది. సంక్రాంతి పండగ ముందు రోజున జరిగిన ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పిల్లా పాపలతో పండగకు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్న లోవలక్ష్మి కుటుంబ సభ్యులు ఈ వార్త విని కుప్పకూలిపోయారు. వీరి మృతితో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏఎస్పీ ఆశ్వర్య రస్తోగి, పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.