సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ (మంగళగిరి)/ సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె ఆగమనానికి సూచికా అన్నట్లు శనివారం ఎండలు భగ్గుమన్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే కాకుండా సాయంత్రం ఐదు గంటలకు కూడా చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే సూర్యకిరణాలు అగ్నికీలల్లా తాకాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో సాయంత్రం తర్వాత కూడా ఉష్ణతాపం ఏమాత్రం తగ్గలేదు. రోహిణిలో రోళ్లు పగులుతాయనే సామెతను గుర్తు చేస్తూ ఈ కార్తె ప్రవేశించిన రోజే సూర్య ప్రతాపం పెరిగింది. రాష్ట్రంలో 20కి పైగా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా నూజెండ్లలో గరిష్టంగా 46.39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక రోళ్లు పగులుతాయ్!
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని నానుడి. శనివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
అదేవిధంగా రేపు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుంది. ఎల్లుండి.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 29న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు; శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు; విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులకు అవకాశం
రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరోపక్క ఇప్పటికే దక్షిణ అండమాన్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి విస్తరించాయి. ఈ నెల 29, 30 నాటికి ఇవి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment