కారంచేడు : గిట్టుబాటు ధరలు రాకపోతాయా..ధాన్యం బస్తాలు అమ్ముకుని మళ్లీ పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేకపోతామా... అని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన ధాన్యం బస్తాలను గిట్టుబాటు ధరలు వచ్చేదాకా గోడౌన్‌లో దాచుకుంటే.. అనుకోకుండా అక్కడ జరిగిన అగ్నిప్రమాదం వారిని తీవ్ర నష్టానికి గురిచేసింది. ఆ వివరాల ప్రకారం... కారంచేడు పెద్దబజారు సమీపంలో వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ గోడౌన్‌లో పలువురు రైతులు పండించిన 1,313 వరిధాన్యం బస్తాలను నిల్వచేశారు.
గిట్టుబాటు ధర వచ్చినప్పుడు వాటిని అమ్ముకుని మళ్లీ పంటలు సాగుచేసుకునేందుకు పెట్టుబడితో పాటు ఇతర అవసరాలు తీర్చుకుందామనుకున్నారు. కానీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో సంభవించిన అగ్నిప్రమాదం ఆ రైతుల నోట్లో మట్టికొట్టింది. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో గోడౌన్‌తో పాటు దానిలోని ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం క్వింటా ధాన్యం ధర 1,200 రూపాయలుంది. దాని ప్రకారం 15.75 లక్షల రూపాయల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి.
అదే విధంగా ఆ గోడౌన్‌లోనే కారంచేడు గ్రామానికి చెందిన అప్పలాచారి, మస్తాన్‌వలి నిర్వహిస్తున్న ఉడ్‌వర్క్‌షాప్ కూడా దగ్ధమైంది. షాపులోని 10.11 లక్షల రూపాయల విలువైన కలప, 5 లక్షల రూపాయల విలువైన ఉడ్‌వర్క్ మిషన్లు కాలిపోయాయి. గోడౌన్ పెద్దది కావడంతో షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు లోపలంతా వ్యాపించిన తర్వాతే బయటకు తెలిసింది. దీంతో భారీ నష్టం జరిగింది. వేకువజామున గమనించిన స్థానికులు.. వెంటనే చీరాల అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్‌తో హుటాహుటిన చేరుకున్న సిబ్బంది ఉదయం 8 గంటల వరకూ శ్రమించి మంటలను అదుపుచేశారు.
అప్పటి వరకూ కళ్లముందే తమ కష్టం బుగ్గిపాలవుతుంటే రైతులంతా నిస్సహాయస్థితిలో చూస్తూ ఉండిపోయి కంటతడిపెట్టారు. ప్రైవేట్ గోడౌన్ కావడంతో ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. స్థానిక తహశీల్దార్ పీవీ సుబ్బారావు, ఆర్‌ఐ సుశీలాదేవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 36 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. గోడౌన్‌ను పరిశీలించిన స్థానిక ఎస్సై శింగంశెట్టి మల్లికార్జునరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైతు కష్టం బుగ్గిపాలు
Published Wed, Aug 6 2014 3:40 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement