
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం (రాజమహేంద్రవరం): శబరి, ఇంద్రావతి, సీలేరు, ప్రాణహిత, తాలిపేరు, కొండవాగులు ఉప్పొంగుతుండటంతో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ చానల్‌లోకి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,24,268 క్యూసెక్కుల ప్రవాహం రాగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా గోదావరికి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 1463.404 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. మరోవైపు వంశధార, నాగావళిలల్లో వరద ప్రవాహం నిలకడగా ఉంది.
నెలాఖరు నాటికి సాగర్ నిండే అవకాశం
కృష్ణా, తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆల్మటి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులోకి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి ఏడు గంటలకు 2,13,349 క్యూసెక్కులు చేరాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి లిఫ్ట్‌లకు 30 వేల క్యూసెక్కులు వదిలి మిగతా 1.83 లక్షల క్యూసెక్కులను నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.3 అడుగుల్లో 206.1 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 553.4 అడుగుల్లో 217.33 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూసీ, హాలియాల ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి 11,883 క్యూసెక్కులు చేరుతుండటంతోనీటి నిల్వ 5.33 టీఎంసీలకు చేరింది. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,35,768 క్యూసెక్కులు రాగా.. 1,28,727 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. రాత్రి ఏడు గంటలకు 57,179 క్యూసెక్కులకు వరద తగ్గడంతో అంతే స్థాయిలో గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండటంతోపాటూ పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముంపులోనే కొవ్వూరు గోష్పాదక్షేత్రం
గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల వద్ద మూడు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. మరోవైపు ఎర్రకాల్వ తన ప్రతాపం చూపుతూనే ఉంది. నందమూరు అక్విడెక్ట్ వద్ద 39.7 అడుగుల నీటి ప్రవాహం ఉండగా, ఆ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిడదవోలు మండలంలో శెట్టిపేట గ్రామ శివారున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోపలకు ఎర్రకాలువ వరద నీరు ప్రవేశించడంతో తాడేపల్లిగూడెం – నిడదవోలు మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు నిడదవోలులోని ఐదు వార్డుల్లోకి వరదనీరు ప్రవేశించింది. లంక గ్రామాల్లో కూరగాయల పంటలు పూర్తిగా కుళ్లిపోవడంతో సుమారు ఐదు వేల ఎకరాల్లో రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయోధ్యలంకలోకి వరదనీరు ప్రవేశించడంతో అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అయోధ్యలంక పరిధిలోని పుచ్చల్లంక, రాయిలంకలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. భీమలాపురం ఏటిగట్టు దిగువన ఉన్న కాపులపాలెంను వరదనీరు చుట్టిముట్టింది. ఆచంట, పోడూరు మండలాల్లోని నక్కల డ్రెయిన్‌కు వరద ఉధృతి పెరగడంతో ఈ మండలాలలో దాదాపు 1500 ఎకరాలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment