ధర బాగానే పలికిందట..
టీడీపీలో రాజ్యసభ సీట్లకు ధర బాగానే పలికిందట. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పాదయాత్ర, మీకోసం బస్సుయాత్ర కార్యక్రమాల్లో వెన్నంటి నడచిన గరికపాటి మోహన్‌వుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. ఇద్దరూ ఆర్థికంగా స్థితిమంతులే. దాంతో టీ, టిఫిన్లు ఖాయమని కొందరు ఎమ్మెల్యేలు భావించారట. కానీ అలాంటిదేమీ లేకుండానే చంద్రబాబు మాక్ పోలింగ్ నిర్వహించి మరీ వారికి పకడ్బందీగా ఓట్లు వేయించారు. గతంలో పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన ఒక నాయకుడు తన పదవీకాలం ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వీడ్కోలు సభ సందర్భంగా కొత్త అభ్యర్థి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట.
పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం చాయ్ కూడా తాగించకుండానే పెద్దల సభలో అడుగుపెట్టానని, ఆ క్రెడిట్ పార్టీ అధినేతకు దక్కుతుందంటూ రిటై రవుతున్న నాయకుడు చెప్పుకొచ్చారు. అయితే బాబు ఆశీస్సులు ఏంటా? అని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరాతీసి ముక్కున వేలేసుకున్నారట. గతంలో జరిగినట్టే ఇటీవల జరిగిన రెండు రాజ్యసభ సీట్లలో ఒక అభ్యర్థికి రూ.30 కోట్ల వరకు ఖర్చయిందట. మరో అభ్యర్థికి 20 కోట్లపైనే చెల్లించుకోవలసి వచ్చిందట. వీటిని పార్టీ చందా కింద సమర్పించారట. అవును.. మీకెవరికీ చాయ్ కూడా తాగించలేదు. కానీ ధర భాగానే పలికింది బాబూ.. అని కొత్త అభ్యర్థి అసలు విషయం చెప్పడంతో ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోయారట.