చినుకు మిణుకు...ఆశ !
విజయనగరం కంటోన్మెంట్ : ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ జిల్లాలో ఎక్కడా భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. దీంతో వానల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులుంటే నారు మడులు ముదిరిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. సోమవారం నుంచి తేలికపాటి వర్షాలు కురవ డం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురవగా, మిగతా మండలాల్లో కొద్దిపాటి జల్లులు కురిశాయి. కాగా , మంగళవారం జిల్లావ్యాప్తంగా 295.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
గజపతినగరం, నెల్లిమర్ల, భోగాపురం, బొండపల్లి, జామి, కొత్తవలస, డెంకాడ మండలాలు మినహా జిల్లాలో మిగతా మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సాలూరులో 55.4 మిల్లీమీటర్లు కురవగా, చీపురు పల్లిలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతానికీ,ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతానికీ పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం. సాధారణవర్షపాతం 6074.2 మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షపాతం 5884.8 మిల్లీమీటర్లుగా నమోదయింది. సాధారణంగా జూన్ నెలలో అధికవర్షాలు కురిసి, జూలైలో సాధారణ స్థాయిలో వర్షాలు పడతాయి. జూన్‌నెలలో వర్షాలు లేకపోవడంతో ఆ లోటు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే చెరువుల్లో నీరుచేరలేదు.
చెరువులున్న చోట ఉభాలు:
జిల్లాలోని కొన్ని మండలాల్లో చెరువుల కింద ఉన్న పొల్లాల్లో ఉభాలు ప్రారంభించారు. ఉన్నకొద్దిపాటి నీటితో నాట్లు ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో భారీవర్షాలు కురిస్తే గండం నుంచి గట్టెకినట్టేనని రైతులు భావిస్తున్నారు.జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలతో పాటు రా బోయే నాలుగు రోజులకు వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ శాతం, గాలి వే గాలను భారత వాతావరణ శాఖ సూత్రప్రాయంగా తెలిపింది.