
రాజధానిలో కుంభవృష్టి
సిటీబ్యూరో, హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్.. బుధవారం ఒక్కపెట్టున కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా ఏకబిగిన 4 గంటలపాటు వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెరిపిలేకుండా కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం 9.5 సెంటీమీటర్లుగా నమోదైన ఈ వర్షపాతం ఈ సీజన్‌లో రికార్డు సృష్టించింది.
గడిచిన పదేళ్లలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షం కురిసిందని వివరించారు. కాగా, కుండపోత వర్షంతో నగరంలోని అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, లక్డికాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కాల్వలను తలపించాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగి, వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.