తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద నీట మునిగిన ఇళ్లు
సాక్షి నెట్‌వర్క్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు మినహాయించి కోస్తాంధ్ర జనజీవనం అతలాకుతలమైంది. రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఇళ్లు నేలకూలాయి. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, పెసర పంటలు నీటమునిగాయి. ఉభయగోదావరి జిల్లాల్లో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత
తూర్పుగోదావరి జిల్లాలో 10.4 మిల్లీమీటర్లు, ఏజెన్సీ, కోనసీమలోని పలు మండలాల్లో సగటున 25 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతి తగ్గుతున్నా దిగువన గోదావరి లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏజెన్సీలోని విలీన మండలమైన చింతూరులో సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారి నాలుగు రోజులుగా నీట మునిగింది. దీంతో చింతూరు – వీఆర్ పురం మండలాల మధ్య, చింతూరు మండలంలోని 11 గ్రామాల మధ్య నాలుగు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం సమీపంలోని బ్రిడ్జి లంకకు చెందిన 259 మంది వరద బాధితులు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు. కోనసీమలోని సుమారు 23 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు పడవలను ఆశ్రయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 44 గ్రామాలు వరదల బారిన పడ్డాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద బాధితుల కోసం 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,521 మందికి ఆశ్రయం కల్పించామని వివరించారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో వరి చేలు ముంపుబారిన పడి దెబ్బతిన్నాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలేనికి చెందిన పి.పుల్లయ్య (57) ఏటిగట్టు మీద గేదెను మేపుతుండగా పొరపాటున కాలుజారి గోదావరిలో పడి చనిపోయాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంట చేలు జలమయమయ్యాయి. నరసాపురం మండలంలో సుమారు 1,500 ఎకరాలు పంటలు ముంపునకు గురయ్యాయి. గట్టు సమీపంలో ఉన్న నలభై ఇళ్లు నీట మునిగాయి. ఆచంట మండలంలో లంక గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. భారీ వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భీమడోలు మండలం పోలసానిపల్లి సమీపంలో పోలవరం కుడి కాలువలో జారిపడి షేక్‌బాషా అనే దివ్యాంగుడు (30) గల్లంతయ్యాడు. ఎడతెరిపిలేని వర్షాలతో నేడు నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని, జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. పెరవలి మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో పంటలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం పూర్తి సామర్థ్యం మేరకు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. దీంతో వరద నీరు చేలను ముంచెత్తింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో 19 గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. కాగా, కేంద్ర సెంట్రల్ కమిటీ బృందం వేలేరుపాడులోని వరద బాధిత గ్రామాలను పరిశీలించింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీటమునిగిన పొలాలు, ఇళ్లు
కృష్ణా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతుండగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పొలాలు నీటమునిగాయి. 28 మండలాల్లో సాధారణంగా, 18 మండలాల్లో విస్తారంగా, 4 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 47.2 మిల్లీమీటర్లు నమోదవగా.. అత్యధికంగా విస్సన్నపేటలో 112.4 మిల్లీమీటర్లు రికార్డైంది. పశ్చిమ కృష్ణాలో పత్తి, వరి, పెసర పంటలు నీట మునిగాయి. ప్రధాన వాగులైన కట్టెలేరు, తమ్మిలేరు, రామిలేరు, మున్నేరు జలకళను సంతరించుకున్నాయి. కట్టెలేరు, పడమటివాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరువూరులో 10 వేల ఎకరాల్లో పత్తి, వరి నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం జలమయమైంది. బస్టాండ్‌లోకి నీరు చేరి చెరువును తలపిస్తోంది. దివిసీమలో పాముల బెడద అధికమైంది. రెండు రోజుల్లో 30 పాముకాటు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో వరి నారుమడులు, మాగాణి పంట భూములు నీటమునిగాయి. తాడేపల్లి మండలం నులకపేటలో భారీ వర్షాలకు పూరిల్లు కూలిపోయింది. తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో నివాసాల్లోకి నీరు చేరింది. రహదారులు బురదమయంగా మారడంతో పలు కాలనీలకు రాకపోకలు స్తంభించాయి. తుళ్లూరు ప్రాంతంలో కోటేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం గుంటూరు జిల్లాలో 1.58 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాడేపల్లి మండలంలో 8.04, అత్యల్పంగా బొల్లాపల్లిలో 0.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ, పాలకొండ ప్రాంతాల్లో భారీ వాన కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆమదాలవలస తదితర చోట్ల చెదురుమదురు జల్లులు పడ్డాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయనగరం పట్టణంలోని రోడ్లను వర్షపునీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పల్లపు వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. విశాఖలో కుంభవృష్టి కురిసింది. విశాఖ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. జ్ఞానాపురం, వన్‌టౌన్, పాత పోస్టాఫీసు, రైల్వే న్యూకాలనీ, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, బీచ్ రోడ్డులో వర్షంతో రోడ్లు నీటమునిగాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ అర్బన్‌లో 16 సెం.మీ, విమానాశ్రయంలో 8 సెం.మీ భారీ వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
అటవీ ప్రాంతంలో చిక్కుకున్న 150 మంది
బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి ఆదివారం వెళ్లిన భక్తులు కొండ వాగు ప్రవాహం వల్ల రాకపోకలు లేక అటవీప్రాంతంలోనే చిక్కుకుపోయారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కొండవాగు ఉధృతంగా పొంగడంతో దర్శనానికి వెళ్ళిన భక్తులతో పాటు అక్కడ వ్యాపారం చేసేందుకు వెళ్ళిన వారు కూడా అటవీప్రాంతంలో ఉండిపోయినట్లు సమాచారం. సుమారు 150 మంది వరకూ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వెళతారు. వర్షాల వల్ల ఆదివారం 150 మంది మాత్రమే వెళ్లినట్టు సమాచారం. వీరు ఉన్న ప్రాంతానికి సమీప గ్రామమైన కామవరం పదికిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరాలంటే ఒకేఒక్క రోడ్డు మార్గం ఉంది. ఇది కొండవాగు ప్రవాహానికి మునిగిపోవడంతో భక్తులు అటవీప్రాంతంలోనే ఉండిపోయారు. వాగు ఉధృతి అప్పుడే తగ్గే పరిస్థితి కానరావడంలేదు. దీంతో అటవీప్రాంతంలో చిమ్మ చీకటిలో వారంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రేగులకుంట గ్రామానికి చెందిన 10 మంది మహిళలు కూలి పనులకు వెళ్ళి గ్రామ సమీపంలోని కాల్వ ప్రవాహానికి పొలంలోనే ఒక గట్టుమీదే ఉండిపోయినట్టు సమాచారం. కాగా భక్తులు కొండపై సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. వారికి ఈ రాత్రికి సరిపడా ఆహారం, నీరు ఉన్నాయని, రేపు ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్‌లో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై ఆయన ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ సూచనలకనుగుణంగా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రమాదపుటంచున ఉన్న వంతెనలపై ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవనిగడ్డలో పాము కాట్లకు గురైన బాధితులకు తక్షణ మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment