
సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్: దక్షిణ మరట్వాడా నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోపక్క ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక వరకు విదర్భ, మరట్వాడా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈనెల 26న శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఇది 24 గంటల తర్వాత బలపడి వాయుగుండంగా మారవచ్చని తెలిపింది. మరోవైపు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. కోస్తాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని వివరించింది.
సాధారణ ఉష్ణోగ్రతలే..
ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. కొన్ని రోజులుగా సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా, ఆదివారం అనేక చోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు, అనంతపురంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 11 సెం.మీల భారీ వర్షం కురిసింది. శృంగవరపుకోటలో 6, మెరకముడిదాంలో 5, బొబ్బిలి, సీతానగరం, పొదిలిల్లో 4, రాచెర్ల, కోడూరు, రోళ్ల, బద్వేలుల్లో 3, విశాఖపట్నం, ఉదయగిరి, సాలూరు, పాకాలల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాతుమూరు, కర్రివలస, పద్మాపురం, కేసలి, గురివినాయుడుపేట తదితర ప్రాంతాల్లో మామిడిపంట దెబ్బతింది. కొత్తూరులో పిడుగు పడి ఒకరు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment