పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు
ఏలూరు: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇబ్బందులెదుర్కొంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలు కూలిపోడంతో కందరవల్లి, కాంబొట్లపాలెం, అయోధ్యలంక, వల్లూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీమవరంలో రోడ్లు జలమయం అయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్టీసీ డిపోలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్టప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.