భారీ వర్షాలు: నిలిచిన రైళ్లు
గుంతకల్: అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో గుంతకల్ రైల్వే స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాల్లో ట్రాక్‌లు నీట మునిగాయి. ఈ పరిస్థితితో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇక్కడ శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కండపోత వర్షం కురిసింది. దీంతో రైల్వేస్టేషన్‌లోని నాలుగు, ఐదు, ఆరో నంబర్ ప్లాట్‌ఫారాల్లోని రైల్వే ట్రాక్‌లపై భారీగా నీరు చేరి కాల్వలను తలపిస్తున్నాయి.
దీంతో బెంగళూరు ఎక్స్‌ప్రెస్, ముంబై నుంచి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్, గుంతకల్ - కర్నూలు టౌన్ పాసింజర్, బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్, గుంతకల్ నుంచి తిరుపతి వెళ్లే పాసింజర్, నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్‌లు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ ఒక్కటే క్లియర్‌గా ఉండడంతో ఒకదాని తర్వాత ఒక రైలును పంపిస్తున్నారు.
రైళ్లను గుంతకల్ సమీపంలో ఉన్న తిమ్మంచర్ల స్టేషన్, కర్నూలు జిల్లా నంచర్ల, ఆదోని, తదితర ప్రాంతాల్లో నిలిపివేశారు. మరోవైపు వైర్లు నీటమునగడంతో సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో రైల్వే సిబ్బంది నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.