భారీవర్షంతో అతలాకుతలం | heavy rains lash andhra pradesh | Sakshi
Sakshi News home page

భారీవర్షంతో అతలాకుతలం

Published Fri, Aug 16 2013 1:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

గుంటూరు జిల్లా వేమవరంలో పొంగుతున్న రాళ్లబండి వాగు

గుంటూరు జిల్లా వేమవరంలో పొంగుతున్న రాళ్లబండి వాగు

సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగు లు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలు, పట్టణాల్లో లోత ట్టు ప్రాంతాలతోపాటు రోడ్లు జలమయమయ్యాయి.వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఏడుగురు మృతిచెందారు. వాగుదాటుతూ ఓ విద్యార్థి గల్లంతయ్యాడు.
 
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం జల దిగ్బంధమైంది. వందల ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట ముగియాయి. దాచేపల్లి, కారంపూడి, మాచర్ల, గురజాల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దాచేపల్లి పరిధిలోని నాగులేరు పొంగి ప్రవహించింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి వాగునీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు.

నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి పట్టాల కింద ఉన్న కంకర, ట్రాక్ ప్లేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మతుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కారంపూడిలో నాగులేరు నిండుకుండను తలపించింది. ఎర్రవాగు, తుమ్మలవాగు, కబోదివాగు, రాళ్లబండివాగు ఉద్ధృతి కార ణంగా సమీప పొలాల్లో పంటలు నీట మునిగాయి. గురజాల మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

నల్లగొండ జిల్లా తిప్పర్తి  మండలం మామిడాల గ్రామ సమీపంలోని పాలేరు వాగు దాటుతూ విద్యార్థి షణ్ముఖం (14) గల్లంతయ్యాడు.  సూర్యాపేటలోని సిద్ధార్థ స్కూల్‌లోఅతను 9వ తరగతి చదువుతున్నాడు.
 
వరంగల్ జిల్లా కొడకండ్లలోని బయ్యన్నవాగులోకి భారీగా వరదనీరు చేరింది.  తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టు పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.  నర్సింహులపేటలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోర్నకల్‌లో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో భారీ వర్షంతో పంటలు కొట్టుకుపోయాయి.  కురవి, కేసముద్రం ఎస్సీకాలనీ, డోర్నకల్‌తోపాటు వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది.
     
కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్‌ఎండీకి చేరడంతో పదోనంబర్ గేటు ఎత్తి రెండువేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. దిగువ కాకతీయ కాలువకు నీటి విడుదలను నిలిపివేయడంతో శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది.

ఖమ్మం జిల్లా వైరా, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల పరిధిలో 6 సెంటీమీటర్లు, కొత్తగూడెం, ఖమ్మంలో 5సెంటీమీటర్ల వర్షపాతం పడింది.   జలాశాయల్లో భారీగా నీరు చేరుతోంది.
 
పిడుగుపాటుకు ఏడుగురి మృతి
ఖమ్మం/శ్రీకాకుళం, న్యూస్‌లైన్: పిడుగుపాటుతో గురువారం ఖమ్మం జిల్లాలో వేర్వేరు ప్రాంతాలలో ఆరుగురు మృతిచెందగా, శ్రీకాకుళం జిల్లాలో మరొకరు మరణించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన భార్యాభర్తలు  భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లారు. వర్షం వస్తుండడంతో ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలోనే పిడుగు పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

కొత్తగూడెం మండలం రేగళ్ల శివారు పెద్దతండాకు చెందిన దారవత్ లింగి (35) నాట్లు వేసేందుకు  వెళ్లాడు. భారీవర్షంతో ఇంటికి వెళుతుండగా, పిడుగు పడి మృతి చెందాడు. బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన బానోతు నాగమణి(28) పత్తిచేలో కలుపు తీస్తుండగా వర్షం మొదలైంది. చెట్టుకిందకు వెళ్లగా, పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.  

టేకులపల్లి మండలం మంగలితండాలో  కౌలురైతు మోకాళ్ల భద్రయ్య (38) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన పశువుల కాపరి సుపావత్ జామ్లా (60) పశువులను మేపుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో పిడుగు పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కిరప గ్రామానికి చెందిన పాలక ప్రభాకర్ (18) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement