జలదిగ్బంధం.. వర్ష ఉధృతితో నిలిచిన రాకపోకలు
సాక్షి నెట్‌వర్క్: భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని యన్నాదేవి వద్ద బసమ్మ వాగు చప్టాపై నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో మాచర్ల వైపు పత్తితో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలోని కావూరు వద్ద వాగు పొంగిన కారణంగా ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ప్రకాశం జిల్లాలో 28 చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒంగోలులో 50 కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వైరానది పొంగి ప్రవహిస్తుండటంతో కంచికచర్ల, వీరులపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండవల్లి మండలం పెనుమాకలంక, మణుదుర్రు రహదారిలో కొల్లేరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుడివాడ, మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాకినాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ముంపునీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరింది. రాజమండ్రి, అమలాపురం వంటి ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో రాజవొమ్మంగి మండలంలో మడేరు, అడ్డతీగల మండలంలో పెద్దేరు వాగులు పొంగి పొర్లుతుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వశిష్ఠ ఎడమ గట్టు 150 మీటర్ల పొడవునా గోదావరిలోకి కుంగిపోయింది. భోగాపురం మండంలో బుధవారం కొట్టుకుపోయిన కాజ్‌వేను ఇంకా పునరుద్ధరించకపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జామి, వేపాడ మండలాల్లో ఎనిమిది కాజ్‌వేలపై రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 120 గ్రామాలు నీటి ముంపులో ఉన్నాయి. పాలకొండలో గజాలఖానా, మందసలో దామోదరసాగరం, సోంపేటలో పైడిగాం కాలువ, పలాసలో వరహాల గెడ్డతోపాటు పలుచోట్ల అనేక కాలువలు, చెరువులు పొంగి పొర్లుతూ రోడ్లపైకి రావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలోలోని ఏజెన్సీలో జంపన్నవాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
881 అడుగులు దాటిన శ్రీశైలం నీటిమట్టం
వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి 881.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 197.9120 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం జలమయం
భారీ వర్షాలతో శ్రీశైలం జలమయమైంది. గురువారం ప్రధానాలయ మాడ వీధులన్నీ నీటితో నిండిపోయాయి. శ్రీగిరికాలనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఇళ్లు, గుడిసెలలోకి నీరు ప్రవేశించడంతో ఆస్తినష్టం సంభవించింది. గంగాభవాని స్నానఘట్టాల ప్రాంతంలో రక్షణ గోడలు విరిగి పడిపోగా, మెట్లు, రోడ్డు మార్గం కోతకు గురైంది. భవనాశి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొత్తపల్లి-ఆత్మకూరు మండలాల్లోని 20 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కురుకుంద గ్రామం నుంచి ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఈ వాగులో చిక్కుకుపోగా ఇందులోని 40 మంది రైతులను తాళ్లసాయంతో పోలీసులు రక్షించారు.
వైఎస్సార్ జిల్లాలో కోలుకోలేని దెబ్బ
వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పెన్నా, కుందూ, సగిలేరు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముద్దనూరు మండలం కాండ్లోపల్లెకు వెళ్లే రహదారికి గండి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తోకలపల్లె కాలువ కట్ట వద్ద 200 మీటర్లకు పైగా రోడ్డు కోతకు గురైంది.
వాగులో చిక్కుకుపోయిన బస్సు..
గుంటూరు జిల్లా నరసరావుపేట పక్కనే ఉన్న కత్వవాగు పొంగి గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై మూడడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు 30 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెళుతున్న ఎమ్మిగనూరు డిపో బస్సు వాగులో చిక్కుకుంది. వాగు ఉధృతి పెరగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది మూడు పొక్లెయిన్లు, క్రేన్ వాగులోకి దించి ప్రయాణికులను సురక్షితంగాబయటకు తరలించారు.
పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళుతూ..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదెం గ్రామానికి చెందిన నందిగం కవితకు బుధవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావటంతో ఆస్పత్రికి బయలుదేరారు. ఆమెను లారీ ఎక్కించి రెంటపాళ్ళ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించారు. నరసరావుపేట శివారులో లారీ వాగులో చిక్కుకుంది. దీంతో ఆమెను 108 వాహనంలోకి ఎక్కించారు. ఆమె ఆ వాహనంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
వాగులో కొట్టుకుపోయిన బస్సు..
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురాళ్లపాడులో ముసి వాగులో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. ఆర్టీసీ సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణికులు బస్సుతో సహా వాగులో చిక్కుకుపోవంతో తీవ్ర ఆందోళనవ్యక్తమైంది. ఆ ఎనిమిదిమంది బస్సుపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేశారు. స్థానికులు దాదాపు 3గంటలు కష్టపడి తాళ్ల సహాయంతో వారిని రక్షించారు. యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లికి చెందిన 30మంది పశువుల మేత కోసం నల్లమల అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయారు.
మరో 24 గంటలు వర్షాలే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దారి మళ్లింది. అయినా 24 గంటల పాట్లు(గురువారం సాయంత్రం 5 గంటల నుంచి) వర్షాలు తప్పవని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాలకు గురువారం రాత్రి నాటికి అల్పపీడనం భూ పై భాగానికి పయనిస్తోంది. మరో రెండు రోజుల్లో వాయవ్యంగా పయనించే అవకాశం ఉంది. దీని కారణంగా రానున్న 24గంటల్లో కోస్తాంధ్ర,తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ 20 సెం.మీ పైగానే వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
వరద నీటిలోనే అంతిమ యాత్ర
వరుసగా తుపాను, అల్పపీడనంతో ప్రకృతి కన్నెర్ర చేసిన శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో ఇదో విషాద ఘట్టం. ఊరి చుట్టూ వరద నీరు. గ్రామంలో మృతి చెందిన వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశమే లేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని బహుదా నది నీటి ప్రవాహంలో విడిచిపెట్టేశారు. ఈ విషాద సంఘటన ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామంలో జరిగింది. వర్షాల కారణంగా అస్వస్థతకు గురైన భుక్తో బెహరా అనే వృద్ధుడు గురువారం ఉదయం కన్నుమూశాడు. అంతిమ సంస్కారాలకు అవకాశం లేకపోవటంతో అతడి మృతదేహాన్ని వరద నీటి ప్రవాహంలో విడిచిపెట్టేశారు.