విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన అనంతరం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) భద్రతను కట్టుదిట్టం చేసింది. మునుపటికంటే హైసెక్యూరిటీతో మరింత అప్రమత్తమవుతోంది. దేశ చరిత్రలోనే ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో విమానాశ్రయాల్లోని రెస్టారెంట్లు, ఇతర కౌంటర్లు, విభాగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు ఇకపై విధిగా పాస్‌పోర్టును కలిగి ఉండాలన్న నిబంధన విధించింది. ఇప్పటివరకు వీరికి పాస్‌లు మాత్రమే జారీ చేయడం, ఆయా సంస్థలు/నిర్వాహకులు ఇచ్చే గుర్తింపు కార్డులతోనూ అనుమతించే వారు. ఇలా పాస్‌లు, గుర్తింపు కార్డులు ఇష్టానుసారం జారీ చేయడం వల్ల ప్రముఖుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఏదో రకమైన పాస్‌లతోనో, లేక సిఫార్సులతోనో విమానాశ్రయంలోకి వెళ్లిరావడం తేలిగ్గా జరిగిపోయేది.
ఈ పాస్‌లతో రన్‌వే మినహా మిగతా ప్రాంతాల్లో వీరు విచ్చలవిడిగా తిరిగేవారు. గత నెల 25న జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నం ఘటనతో ఇటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విమానయాన సంస్థలతో పాటు సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులోని విమానయాన సంస్థలు, రెస్టారెంట్లు, విమానయానేతర సంస్థల సిబ్బందికి కూడా పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న నిబంధనను అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు నంబర్‌ను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్రితో పాటు వెంట వెళ్లేందుకు వ్యక్తిగత కార్యదర్శి/సహాయకుడిని మాత్రమే అనుమతిస్తారు. అయితే వారికి కూడా ఆధార్ తప్పనిసరి.
సీఎంతోనే మొదలు
ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్‌పోర్టులో బీసీఏఎస్ నిబంధనల అమలును ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లేందుకు సోమవారం విశాఖ వచ్చిన చంద్రబాబు ఎయిర్‌పోర్టు వీవీఐపీ లాంజ్‌లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత సహాయకులను కూడా ఎయిర్‌పోర్టు భద్రత, సీఐఎస్‌ఎఫ్ అధికారులు అనుమతించలేదు. చివరకు విమాన టిక్కెట్టు కొనుక్కుని లోపలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు కావడం వల్ల వారిని అనుమతించారు. ఇక సీఎం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారీ పెద్ద ఎత్తున అనుసరించే అధికారులను కూడా భద్రతా చర్యల్లో భాగంగా అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విమానాశ్రయంలోకి 43 మంది అధికారులను అనుమతించాలని విశాఖ ఆర్డీవో దరఖాస్తు చేయగా ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మంత్రులు సిఫార్సు చేసినా ఒప్పుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment