
పిల్లలతో ‘హెరిటేజ్’ చెలగాటం
కుప్పం, న్యూస్‌లైన్ : ‘పశువైద్య శిబిరం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పుడ్స్ కంపెనీ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడింది. పాఠశాల ఆవరణలోనే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పలువురు అస్వస్థతకు లోనయ్యారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు సకాలంలో స్పందించడంతో పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పైపాళెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పైపాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం 40 మంది హాజరయ్యారు.
ఉ.9 గంటలకు ప్రార్థన చేస్తుండగా అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆ కంపెనీ ప్రతినిధులు సంచార పశు వైద్య శిబిరాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేశారు. వద్దని ఉపాధ్యాయులు వారించినా వినలేదు. విద్యార్థులకు అతిసమీపంలో ఐదు పశువులపై బూటాక్స్ (విషపూరిత క్రిమిసంహారక మందు)ను స్ప్రే చేశారు. పక్కనే ఉన్న విద్యార్థులపై మందు తుంపర్లు పడ్డాయి. దీంతో 22 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం, శ్వాసకోశ బాధతో అక్కడే కుప్పకూలిపోయారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీహెచ్‌సీకి తరలించారు. ఇద్దరికీ ఆక్సిజన్‌తోపాటు అత్యవసర చికిత్సలు అందించారు. మిగిలిన వారికి సాధారణ చికిత్స అందించి ఇళ్లకు పంపించేశారు.