
సాక్షి, హైదరాబాద్: పోలవరం విషయంలో కేంద్రప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. 1.4.2014 నాటి ప్రాజెక్టు వ్యయానికి మాత్రమే చెల్లింపులు చేస్తామన్న ప్రకటనపై వివరణివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. పోలవరం నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తా మంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శులకు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కేవీపీ పిల్‌ను విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, కేంద్రం తన ఆర్థిక బాధ్యతను 1.4.2014కే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేరకు మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలివ్వాలంటూ కేవీపీ గతవారం హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృత్వం లో ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment