సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీటిని ప్రోత్సహించబోమంటూ చెప్పేవన్నీ ఉత్త మాటలేనంది. రాజ్యాంగం అంటే గౌరవం లేని వారే అధిక సంఖ్యలో చట్టసభలకు వస్తున్నారని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ సీపీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నివేదించారు. తెలంగాణలో కూడా ఇలాంటి అంశానికి సంబంధించి తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ఓ రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఫిరాయింపుదారులకు మరోసారి నోటీసులు...
వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు గురువారం మరోసారి నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులకు కూడా హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు గతంలో నోటీసులిచ్చింది.
వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురిని ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. దీనికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో ఫిరాయింపుదారులైన బుడ్డా రాజశేఖరరెడ్డి, అత్తారు చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సరేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, టి.జయరాములు, జ్యోతుల నెహ్రూ, పాశం సునీల్‌కుమార్, వి.సుబ్బారావు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, ఎం.అశోక్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వి.రాజేశ్వరిలతో పాటు మంత్రులుగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావులకు ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఎవరొచ్చినా జరుగుతుంటాయి
Published Fri, Jun 29 2018 4:54 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment