సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగకుండా చూడాలంటూ 2016లో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ రకంగానైనా తమ ఆదేశాల ఉల్లంఘన జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవని, దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. సంక్రాంతి సందర్భంగా ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది.
కోడి పందేలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు గట్టి చర్యలు తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని హైకోర్టు నమోదు చేసింది.
కోడి పందేలకు సంబంధించి 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్‌హెచ్‌ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి కలెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వతేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment