hen racing
-
మేం కళ్లు మూయలేదు
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగకుండా చూడాలంటూ 2016లో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ రకంగానైనా తమ ఆదేశాల ఉల్లంఘన జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవని, దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. సంక్రాంతి సందర్భంగా ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. కోడి పందేలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు గట్టి చర్యలు తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని హైకోర్టు నమోదు చేసింది. కోడి పందేలకు సంబంధించి 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్హెచ్ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి కలెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వతేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోడిపందాలపై పోలీసుల పంజా
నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 వేలతో పాటు 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆవుపాడులో గత కొన్ని రోజులుగా భారీగా కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. -
కోడి పందాలు కాస్తున్న ఐదుగురి అరెస్ట్
హయత్‌నగర్: పందాల రాయుళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హయత్‌నగర్ పరిధిలోని కోహెడ సర్వీసు రోడ్డు సమీపంలో కోడి పందేలు కాస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.29 వేల నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు, 6 సెల్ఫోన్లు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 300 కోట్లు కొక్కొరొకో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి జిల్లాల్లో భోగి పండుగ రోజు మొదలైన కోడిపందేలు మకర సంక్రాంతి నాడు తారాస్థాయికి చేరుకుని కనుమరోజు రాత్రి పొద్దుపోయేవరకు జోరుగా సాగాయి. ఈ మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగిన పందేలలో సుమారుగా రూ.300 కోట్ల వరకు చేతులు మారాయని అంచనా. హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజా ప్రతినిధుల అండతో మొదలైన కోడిపందేలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జాతరల మాదిరిగా కొనసాగాయి. పందెం బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టుషాపులు వెలిశాయి. కోడి పందేలు, పేకాటల్లో కోట్లల్లో డబ్బు చేతులు మారగా గుండాట, కోతాటల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. చేతులు మారిన రూ.300 కోట్లు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.300 కోట్లు చేతులు మారినట్లు అంచనా. అందులో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారుగా రూ.250 కోట్ల మేర పందేలు సాగినట్లు తెలుస్తోంది. ఎక్కువ బరులు ఏర్పాటైన చింతలపూడి నియోజకవర్గంలోనే సుమారు రూ.100 కోట్లకు పైబడి పందేలు, జూదాలు జరిగినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పందేలకు అనుమతులివ్వక పోవడంతో సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంపై ఆ ప్రభావం కనిపించింది. తెలంగాణకు చెందిన వేలాదిమంది కార్లు, బైకులపై ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులవైపు ప్రయాణం కట్టారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద రాయలసీమ ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కనిపించారు. ఈ మూడురోజుల్లో జరిగిన పందేలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు శివకృష్ణ, జబర్దస్త్ కార్యక్రమంలోని పలువురు నటులు పాల్గొన్నారు. మరో రోజు అనుమతికి యత్నాలు మూడు రోజులూ అనధికార అనుమతులతో జోరుగా పందేలు నిర్వహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముక్కనుమ రోజైన ఆదివారం కూడా పందేలను నిర్వహించడానికి పోలీసు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఐతే పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. -
పోలీసుల దాడుల్లో నగదు, కోళ్లు స్వాధీనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో కోడి పందాల స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నగదు, కోళ్లతో పాటు పలువురి పందెంరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల వారీగా.. విజయనగరం: భోగాపురం మండలం బసవపాలెంలో ఐదుగురు పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ.16 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం: సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 25 కోళ్లు, రూ.15 వేలు నగదుతో పాటు కోడి పందేలు నిర్వహిస్తున్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా: ఐరాల మండలం గాజులపల్లెలో కోడి పందెలు నిర్వహిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
కోడి పందేలను అనుమతించం
► ఎస్పీలకిచ్చిన ఆదేశాలు ఈ ఏడాదీ అమలవుతాయి ► హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతిచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఎవరైనా చట్ట నిబంధనలను ఉల్లంఘించి కోడి పం దేలను నిర్వహించినా, జూదమాడినా చర్యలు తీసుకోవాలని గతంలో ఆయా జిల్లాల ఎస్పీల కు ఆదేశాలు జారీ చేశామని, వాటిని ఈ ఏడా దీ అమలు చేస్తామని తెలిపింది. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ అదే జిల్లాకు చెందిన నరహరి జగదీశ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారించంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అనుమతివ్వాలని పిటిషన్.. కోడి పందేల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రధాన వ్యాజ్యంతోపాటు ఇంప్లీడ్ పిటిషన్‌పైనా ధర్మాసనం విచారించింది. -
కొ..క్కో..కోట్లు
రూ.100కోట్లు చేతులు మారాయి యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట గ్రామల్లో మూడురోజుల జాతర అధికార పార్టీ నేతల అండ పోలీసుల ప్రేక్షకపాత్ర మచిలీపట్నం : సంక్రాంతి సందర్భంగా జిల్లాలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులే స్వయంగా కోడిపందేలు, పేకాట శిబిరాలను ప్రోత్సహించడం వివాదాస్పదమైంది. మూడు రోజుల వ్యవధిలో కోడిపందేలు, పేకాట, గుండాట తదితరాల రూపంలో దాదాపు రూ. 100 కోట్లు చేతులు మారాయని అంచనా. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో ‘బరులు’ ఏర్పాటు చేయడంతో వ్యసనపరులు చేతులు కాల్చుకున్నారు. వేలాది కోళ్లు రక్తం చిందించాయి. కోతముక్కలో పాల్గొన్న పేకాట రాయుళ్లు ఊసూరుమంటున్నారు. సంప్రదాయం ముసుగులో సాగిన ఈ పందేల వ్యవహారంలో నగదు పోగొట్టుకున్న వారే అధికశాతం ఉండడం గమనార్హం. నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పందెం, పేకాట రాయుళ్లు బరితెగించి ఈ ఏడాది తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకున్న పందెంరాయుళ్లు బరితెగించి కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. గత ఏడాది విజయవాడ పరిసరాల్లో కోడి పందేలు అంతగా జరగలేదు. ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా కోడిపందేల శిబిరాలు ఏర్పాటు చేయడం, అక్కడే మద్యం, భోజన వసతులు, విద్యుత్‌లైట్ల ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల కనుసన్నల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో మూడురోజుల క్రితమే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోడిపందేల శిబిరాన్ని ప్రారంభించారు. ఇక్కడ యథేచ్ఛగా కోడిపందేలు జరిగాయి. విజయవాడ రూరల్ మండలం నున్నలోనూ కోడిపందేల జోరు కొనసాగింది. పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందుర్రులో పదెకరాల విస్తీర్ణంలో కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈ పోటీల వద్దకు వెళ్లి తిలకించడం గమనార్హం. నాగేశ్వరరావుపేటలో ఎమ్మెల్యే కాగిత స్వయంగా కోడిపందేలను ప్రారంభించారు. కోడిపందేలతో పాటు గుండాట, పేకాట యథేచ్ఛగా ఇక్కడ కొనసాగాయి. పెడన మండలం బల్లిపర్రు, కోంకేపూడి, కట్లపూడి గ్రామాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే ఉన్న మల్లెతోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట కొనసాగాయి. గూడూరు మండలంలో చిట్టిగూడూరు, పోసినవారిపాలెం, రామన్నపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున బరులు నిర్వహించారు. పేకాట జోరుగా కొనసాగింది. కృత్తివెన్ను మండలం కొమాళ్లపూడి, పోడు, చినగొల్లపాలెం, వాలంక తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. కైకలూరు మండలం భుజబలపట్నలో శుక్రవారం జరిగిన కోడిపందేల శిబిరాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పరిశీలించి పందేలను తిలకించారు. ముదినేపల్లి మండలం వైవాక, చిగురుకోట తదితర గ్రామాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. భుజబలపట్నంలో గుండాట భారీ ఎత్తున సాగింది. మండవల్లి మండలం చింతపాటు, బైరవపట్నం, ఇంగిలిపాకం గ్రామాల్లోనూ కోడి పందేలు, పేకాట జోరుగా సాగాయి. నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లోని మామిడి తోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట నిర్వహించారు. కొంత మంది పందెం రాయుళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు తరలివెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున కొనసాగాయి. మోపిదేవి మండలం చిర్లపాలెంలో కోడిపందేలు శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కోడూరు మండలం జరుగువానిపాలెంలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలోని కారకంపాడు, గూడపాడు, మెరకనపల్లి తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు కొనసాగించారు. కూచిపూడిలో గురువారం కోడిపందేల శిబిరం వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణలకు దారి తీసింది. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, గుడ్లవల్లేరులలో పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. గుడివాడ పట్టణంలోనే కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పోలాటితిప్ప, చిన్నాపురం, గుండుపాలెం, మేకవానిపాలెం గ్రామాల్లో జోరుగా కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. ఇదేం సంప్రదాయం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మూడు రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, పేకాట జోరుగా కొనసాగాయి. టీడీపీ ప్రభుత్వం కోడిపందేలు, జూదాలను ప్రోత్సహించి రైతులను నిలువునా ముంచింది. ప్రభుత్వ వైఖరి కారణంగా జిల్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. సంక్రాంతి సంప్రదాయం పేరుతో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కోడిపందేలు, పేకాట శిబిరాల్లో వేలాది మంది నగదు పోగొట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్రాంతి కానుక ఇదేనా. - నరహరిశెట్టి నరసింహారావు,డీసీసీ అధ్యక్షుడు -
‘బరి’లో దేశం ఎమ్మెల్యేలు
యథేచ్ఛగా కోడి పందేలు రేపల్లె : సంస్కృతి పేరుతో రేపల్లె నియోజకవర్గంలో జూదానికి తెరతీశారు. కోడి పందేల నిర్వహణకు సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ముందువరసలో నిలిచారు. మండలంలోని గుడ్డికాయ లంక గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కోడి పందేల ప్రత్యేక బరిలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావుల సమక్షంలో తొలిరోజు కోడి పందేలు కోలాహలంగా మొదలయ్యూరుు. తొలి పందెం అనగాని సత్యప్రసాద్, మోదుగుల వేణుగోపాలరెడ్డి మధ్య రూ. లక్షతో మొదలైంది. అక్కడి నుంచిపోటీ పెంచుతూ తమ స్థాయిని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ప్రజాప్రతినిధులే రూ. లక్షల్లో పందేలు కాస్తుంటే జూదరులు విజృంభించారు. మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన కోడి పందేలు సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి రూ. కోటికిపైగా చేరుకుందని సమాచారం. దీంతో జూదరులు రాత్రి కూడా పందేలు నిర్వహించేందుకు బరి చుట్టూ ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. అనుబంధంగా జూదాలు.. కోడి పందేల బరి సమీపంలో అనుంబంధ జూదాల జోరు ఊపందుకుంది. డబ్బా ఆట(జూదం), చక్రం ఆట(జూదం)లలో చిన్నారులు సైతం పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి కోడి పందేలు నిషేధం అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కసారిగా బహిరంగంగా నిర్వహిస్తుండటంతో జూదరులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడి పందేలను ఎట్టి పరిస్థితిలో నిర్వహించనీయమని జిల్లా ఎస్పీ స్పష్టం చేసి ప్రత్యేక పోలీసు బలగాలను నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడి సీఐ పెంచలరెడ్డి ప్రత్యేక బలగాలను కోడి పందేలు నిర్వహణలేని నిజాంపట్నం పంపించారు. దీంతో మధ్యాహ్నం 12గంటలకు గుడ్డికాయలంక చేరుకున్న ప్రజాప్రతినిధులు పోలీసులు అనుమతి ఇచ్చారంటూ కోడి పందేలు ప్రారంభించారు. అసలు అనుమతి ఉందా లేదా అన్నది ఎవరికీ తెలియడం లేదు. -
వివాదంగా మారిన కోడి పందేలు
ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కోర్టు ధిక్కార కేసుకు సన్నాహాలు ప్రేక్షకపాత్రలో పోలీసులు పెనమలూరు : తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. పోరంకిలోని తన కార్యాలయం ఆవరణలో ఆదివారం కోడి పందేలు నిర్వహించి, తాను సంస్కృతిని కాపాడానని ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు కోర్టు ధిక్కార కేసు వేసేందుకు పలువురు సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందేలు చట్టవిరుద్ధమని, ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోడి పందేలు నిర్వహించటం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కోడి పందేలు వేయడాన్ని జంతు, పక్షి సంరక్షణకు చెందిన పలువురు కోర్టులో సవాల్ చేయనున్నారు. కోర్టు పిటీషన్ స్వీకరిస్తే ఎమ్మెల్యే కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు వేస్తున్న సామాన్యులపై పోలీసులు దాడిచేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల పోలీసులు దాడిచేయడంతో కొందరు చెరువులు, వాగులను దాటి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. పోరంకిలో మాత్రం పలువురు పోలీసులు, ఎస్ఐల కళ్లముందే కోడి పందేలు ఎమ్మెల్యే నిర్వహించారు. అయినప్పటికీ కోడి పందేల నిర్వహణ గురించి సీఐ మురళీకృష్ణ వద్ద ప్రస్తావించగా తనకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఆయన చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎమ్మెల్యేగారి ఊళ్లో బిర్రి లేదు వర్రీ...
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ‘కోడిపందేలు నిర్వహిస్తే సహించే ది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రకటించడంతో భయపడుతూ భయపడుతూ తొలిరోజు పలుచగా పందేలు వేసిన నిర్వాహకులకు ఆరోజు పోలీసుల జాడ కనిపించకపోవడంతో ధైర్యం వచ్చింది. ఇంకేముంది మిగిలిన రెండురోజులూ రెచ్చిపోయారు...భారీఎత్తున పందేలకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓమాజీ సర్పంచ్, మరో నాయకుడి ఆధ్వర్యంలో సోమవారం నుంచే పందేలు జోరుగా సాగాయి. సున్నంబట్టిలో కోడిపందేలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడంలేదని ప్రచారం జరగడంతో రెండు బిర్రుల వద్దకు వేలాదిగా జూదరులు, పైపందెగాళ్లు తరలివచ్చి పందేలు కాశారు. దమ్మపేట, కుక్కునూరు, వేలేరుపాడు, ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లోని అధికారపార్టీ కార్యకర్తలు ఆయా గ్రామాలకు చెందిన చిన్న చిన్న పందెగాళ్లను ‘ఎమ్మెల్యే గారి ఊళ్లో బిర్రి పెట్టి పందేలు వేయిస్తున్నాం.. రండి.. ప్రశాంతంగా నడుపుకోండి..’ అంటూ తీసుకువచ్చారు. పదిశాతం కేబుల్ వసూలు.... గొప్పకోసం.. సాంప్రదాయం కోసం కోడిపందేలు నడుపుతున్నామంటూ చెప్పుకునే నాయకులు గిరిజనులను నిలువుదోపిడీ చేశారు. కోడిపందేల నిర్వహణకు ఖర్చులయ్యాయంటూ.. పదిశాతం రుసుమును కేబుల్(బిర్రి మామూలు)గా వసూలు చేశారు. దీంతో ‘ఎమ్మెల్యే స్వగ్రామంలో కోడిపందేలంటే వచ్చాం.. ఆంధ్రాలో మాదిరిగా కేబుల్ వసూలు చేసి జేబులు కత్తిరించారంటూ’ కొందరు గిరిజనులను వాపోయారు. ఆంధ్రాలోకూడా కేబుల్ వసూలు చేస్తున్నప్పటికీ.. టెంట్లు వేసి.. పందెగాళ్లకు కుర్చీలు వేసి.. మినరల్ వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నారని.. ఇక్కడ ఎర్రని ఎండలో దుబ్బలో మందకుమందలా బిర్రిలోకి వదిలి ముక్కుపిండి కేబుల్ వసూలు చేశారని వాపోతున్నారు. జోరుగా పేకాట... కోడిపందేలకు దీటుగా పేకాట(నలుపు, ఎరుపు), మద్యం విక్రయాలు సాగాయి. కోడిపందేల్లో పైపందేలు కాసేందుకు అవకాశం దక్కని వాళ్లు..., జేబులు ఖాళీ కాగా కొద్దోగొప్పో మిగిలిన వారు పేకాట వద్దకు గుమిగూడారు. రూ.10 నుంచి రూ.1000 వరకు నలుపు, ఎరుపు ఆటలో పెట్టారు. ఇంత బహిరంగంగా జూదం నిర్వహిస్తున్నా పోలీసులు అసలు ఆఛాయలకే రాకపోవడం చర్చనీయాంశమైంది. -
కోడి పొడిచింది... ఖాకీ నిద్దరోయింది!
సాక్షి, కొత్తగూడెం: కోడి పందేలను కట్టడి చేస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. అశ్వారావుపేట, భద్రాచలం నియోకజక వర్గాల్లో సంక్రాంతి మూడురోజులూ పందేల నిర్వహణకు అడ్డులేకుండా పోయింది. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పందేలకు సహకరించడంతో పాటు వారు కూడా బెట్టింగ్‌లో పాల్గొనడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారనే ఆరోపణలున్నాయి. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో బహిరంగంగా రెండు బిర్రులు కట్టి అధికార పార్టీ నాయకులు కోడిపందేలు నిర్వహించడం గమనార్హం. ఇక్కడ వెయ్యిరూపాయలలోపు పందెం ఉండదు. దీంతో ఇక్కడ వేలు, లక్షల్లో పందేలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేలకు అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్తుపల్లి ప్రాంతం నుంచి పందెం రాయుళ్లు హుషారుగా తరలి వెళ్లారు. చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, కళ్లచెరువు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పందేలలో జిల్లావాసులు పాల్గొన్నారు. భద్రాచలం ఏజెన్సీలోనూ జోరు.. భద్రాచలం ఏజెన్సీలోనూ కోడిపందేలు జోరుగా సాగాయి. జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారితో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడి పందేలకు తరలివచ్చారు. చర్ల మండలంలోని రాళ్లగూడెం, కలివేరు, చింతగుప్ప, గన్నవరంకాలనీ సుబ్బంపేట తదితర గ్రామాల శివారు అటవీ ప్రాంతాలలో ముమ్మరంగా కోడిపందేలు నిర్వహించారు. వెంకటాపురం మండలంలోని ఉప్పేడు, బెస్తగూడెం, కోయబెస్తగూడెం, పాత్రాపురం గ్రామాల్లోనూ పందేలు సాగాయి. రూ. 2 వేల నుంచి రూ.10 వేల వరకూ బెట్టింగ్ పెట్టారు. అలాగే దుమ్ముగూడెం మండలంలోని గడ్డోరుగట్ట, జిన్నెలగూడెం, దబ్బనూతల గ్రామాలు, చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, మోతుగూడెం, చిడుమూరు, వీఆర్‌పురం మండలంలో చింతరేవుపల్లితో పాటు మండల కేంద్రం శివారు ప్రాంతంలో ముమ్మరంగా కోడి పందేలు సాగాయి. భద్రాచలం మండలంలోని పట్టుచీర, కొండేపల్లి, ఎర్రగట్ట, విస్సాపురం తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి. పై పందేల జోరు.. పందెంరాయుళ్లు కట్టే పందేనికి అదనంగా పైపందేలు నిర్వహించారు. బిర్రి లోపల వారి సంబంధీకులు, సన్నిహితులను అనుమతించగా.. ఇరుపక్షాలు తరపువారు పైపందేలు కట్టారు. పందేలను చూడటానికి వచ్చిన వారు బిర్రి బయట నిలుచుని జోరుగా పందేలు నడిపారు. లోపల పందేనికి వంద రెట్లు పైపందేలు, బయటి పందేలు నడుస్తాయి. బిర్రి లోపలి పందెం రూ. వెయ్యి నడిస్తే పైపందేలు, బయట పందేలు రూ. లక్ష వరకు జరిగాయి. ఇలా సోమవారం మొదలుకొని బుధవారం వరకు కోట్ల రూపాయలలో కోడిపందేలు నిర్వహించారు. దీనికి తోడు పేకాట(నలుపు, తెలుపు), గుండుపట్టాలు నిర్వహించుకునేందుకు, మద్యం దుకాణాలు నడుపుకునేందుకు నిర్వాహకులు ఆయా వ్యక్తుల నుంచి భారీగానే సొమ్ములు వసూలు చేశారు. మందేసి.. చిందులు.. పందేల్లో పాల్గొన్న వారు సొమ్ములు వచ్చినా, పోయినా తప్పతాగి చిందులు వేశారు. వ్యాపారులు కూలింగ్ లేని బీర్ రూ. 140, చీప్‌లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ. 120 చొప్పున అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అంతేకాకుండా పందెం ప్రాంతంలో వడ్డీ వ్యాపారుల హవా కొనసాగింది.పందెంలో చేతులు కాల్చుకున్న వారు తెచ్చిన డబ్బు అయిపోవడంతో తమకు తెలిసిన వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకొని మరీ పందెంలో పాల్గొన్నారు. మొత్తంగా పందెంరాయుళ్లు ఈసారి పెద్ద ఎత్తున చెలరేగిపోవడానికి పోలీసులు చూసీచూడనట్లు వదిలివేయడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
127 మంది జూదరుల అరెస్ట్
సంతమాగులూరు, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా పేకాట, కోడిపందేల శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 127 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి పందెంకోళ్లతో పాటు అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. సంతమాగులూరు మండలంలో 35 మంది... సంక్రాంతి సందర్భంగా మండలంలోని గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న వారితో పాటు పేకాటాడుతున్న మొత్తం 35 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 61,000 రూపాయల నగదు, ఆరు పందెంకోళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఎ.శివనాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామాల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలపై నిఘా పెట్టిన పోలీసులు.. వారికి అందిన సమాచారం మేరకు మండలంలోని బండివారిపాలెం, కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్కాలనీల్లో కోడిపందేల శిబిరాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. రెండు శిబిరాల్లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 26,000 రూపాయల నగదుతో పాటు ఆరు పందెంకోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఏల్చూరు, కొప్పరం, బండివారిపాలెం, కొమ్మాలపాడు పరిసరాల్లో పేకాట శిబిరాలపై దాడిచేసి 22 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 35,085 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను గురువారం అద్దంకి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. ముండ్లమూరు మండలంలో 20 మంది... ముండ్లమూరు, న్యూస్‌లైన్ : మండలంలోని శంకరాపురం గ్రామంలో పేకాటాడుతున్న నలుగురిని ట్రైనీ ఎస్సై కిశోర్‌బాబు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 3,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సిబ్బంది హరికృష్ణ, మరియబాబు, వెంకటేశ్వర్లు, శ్యామ్ పాల్గొన్నారు. ఇదే మండలంలోని మారెళ్ల, కెల్లంపల్లి గ్రామాల్లో కోడిపందేల శిబిరాలపై బుధవారం దాడిచేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రైనీ ఎస్సై కిశోర్‌బాబు తెలిపారు. మారెళ్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 13,110 రూపాయల నగదు, 12 కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కెల్లంపల్లిలో 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 8,150 రూపాయల నగదు, ఆరు కోళ్లు, 29 కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అర్ధవీడు మండలంలో 15 మంది... అర్ధవీడు, న్యూస్‌లైన్ : అర్ధవీడు మండలంలోని కాకర్ల శివారు ప్రాంతంలో కంపచెట్లలో పేకాటాడుతున్న 10 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యరాజ్ తెలిపారు. వారి నుంచి 11,140 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా ఈ నెల 12వ తేదీ యాచవర ంలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి 2,440 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని గిద్దలూరు కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. చీరాల మండలంలో 39 మంది... చీరాల రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక జవహర్‌నగర్‌లో కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు పందెంకోళ్లు, 1,080 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేశాయిపేటలోని పేకాట శిబిరంపై దాడిచేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,100 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒన్‌టౌన్ ఎస్సై స్వామిరెడ్డి, రైటర్ డాల్ఫిన్ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. ఇదే మండలంలోని కావూరివారిపాలెం, నక్కలవారిపాలెం గ్రామాల్లో కోడిపందేల శిబిరాలపై మంగళ, బుధవారాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 2,030 రూపాయల నగదు, ఆరు పందెపు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. గుడ్లూరు మండలంలో ఆరుగురు... గుడ్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని కొత్తపేట గ్రామంలో పేకాటాడుతున్న ఆరుగురిని ట్రైనీ ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10వేల రూపాయలు స్వాధీనం చేసు కున్నారు.నిందితులను గురువారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. చెన్నిపాడులో నలుగురు... చెన్నిపాడు (పొన్నలూరు), న్యూస్‌లైన్ : పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్న నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఈ నారాయణ తెలిపారు.వారి నుంచి ఐదు కోళ్లు, 2,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. -
‘పుంజు’కుంటున్న కోడి పందేలు
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు జోరుగా పందేలు నిర్వహిస్తున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామంలో సోమవారం మూడు కోళ్లు.. ఆరుకత్తులు అన్న చందంగా కోడిపందేలు జోరుగా సాగాయి. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పత్రికలు, లోకల్ కేబుల్ ద్వారా హెచ్చరికలు జారీచేసినా ఎమ్మెల్యే గ్రామస్తులు, అధికార పార్టీ నాయకులు ఖాతరు చేసినట్లు లేరు.. ఎంచక్కా రెండు బిర్రులు కట్టి.. కంచెలతో దడులు నిర్మించి మరీ కోడిపందేలు నిర్వహించారు. మామిళ్లవారిగూడెం- సున్నంబట్టి గ్రామాల మధ్య బీటీ రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్లేందుకు వరిమడులను చెరిపేసి బిర్రుల వరకు మార్గాన్ని శుభ్రం చేశారు. జూదరుల కోసం మద్యం, తాగునీరు, స్టఫ్‌గా కోడి పకోడి.. ఇలా అన్నింటి కీ వేలంపాట పెట్టి అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహానికి కోడిపందేల వాసన తగటడంలో మండలంలోని పలు గ్రామాల జూదరులు సున్నంబట్టి చేరుకున్నారు. ‘ఎంతెచ్చు.. ఐదెచ్చు.. పదెచ్చు.. ’ అంటూ హోరాహోరీగా పందెం కాశారు. బడా జూదరులు పశ్చిమానికే.. పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవనే పోలీసుల ప్రకటనలు చూసి భయాందోళనకు గురయిన పెద్ద పందెగాళ్లు, పందెంలో నిపుణులైన పలువురు కుక్కుటశాస్త్రం పుస్తకాలు పట్టుకుని తెల్లవారేసరికే పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీనివాసపురం, చింతపల్లి, పోతునూరు, భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. పెద్ద పందగాళ్లు పక్క జిల్లాకు వెళ్లిపోవడంతో రూ.1000 లోపు పందెం వేసేవారు, పండుగల సమయంలో మాత్రమే ఆడేవారు స్థానికంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. ఊరూరా కూరపందేలు... గిరిజన గ్రామాల్లో నగదు పందేలు వేయకుండా, కత్తులు కట్టకుండా కూర పందేలను నిర్వహిస్తున్నారు. పందెంలో పాల్గొన్న కోడిని వెంటనే కోసుకుని తినటం ఇక్కడి కొందరి ఆచారం. అదీ సంక్రాంతి పండగ నాలుగు రోజులు ఇలా సరదాగా ఊళ్లో వాళ్లంతా పందెం వేసుకుని కోళ్లను కోసుకుంటుంటారు. ఐతే కూరపందేల పేరుతో లక్షల రూపాయల జూదం కొన్ని చోట్ల జరిగింది. ఒక్కో జోడు కోళ్లు పందెంలో కత్తులు కట్టుకుని తలపడుతుంటే.. రూ.వంద నుంచి వెయ్యి దాకా బిర్రు బయట ఉండి పై పందేలు కట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అటుగా రాలేదు. అయితే పందేల జోలికి వెళ్లవద్దని ఉన్నతాధికారుల నుంచి వారికి ఆదేశాలు వచ్చి ఉంటాయని పలువురు అనుమానం వ ్యక్తం చేస్తున్నారు. లింగగూడెంలో జోరుగా... పెనుబల్లి : మండల పరిధిలోని లింగగూడెంలో సోమవారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు. గ్రామ శివారు వావిళ్లపాడులోని ఓ మామిడి తోటకు వందకుపైగా పుంజులను తీసుకొచ్చి వేలాది రూపాయలు పెట్టి పందేలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ తతంగమంతా పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే కావడం గమనార్హం. కోడి పందేలు నిర్వహిస్తారనే అనుమానంతో సంక్రాంతికి ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
గెలుపెవరిదో..!
జంగారెడ్డిగూడెంరూరల్/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలకు జిల్లావ్యాప్తంగా బరులు సిద్ధమయ్యాయి. కోళ్లతో పందెం రాయుళ్లూ సిద్ధమయ్యారు. పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. పందాలు వేసి జూదరులు గెలుస్తారా.. వాటిని అడ్డుకుని పోలీసులు గెలుస్తారా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. పందేలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడాబాబులు జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి నెల రోజుల క్రితమే నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా తాము అన్నీ చూసుకుంటామంటూ హామీలు ఇవ్వడంతో పారిశ్రామిక, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. జిల్లాలోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఆచంట, తణుకు తదితర ప్రాంతాల్లో భారీగా పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పందేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని, చివరిలో అనుమతి ఖాయమనే ధీమాతో నిర్వాహకులు ఉన్నారు. సంక్రాంతి మూడు రోజులూ జరిగే పందేల జాతరలో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాల నిర్వహణకు రెండు వర్గాల వారు పోటాపోటీగా బరిలు సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ హరికృష్ణ ఆదేశాల మేరకు శ్రీనివాసపురంలోని బరిలపై పోలీసులు దాడులు చేసి ఫెన్సింగ్‌లను తొలగించారు. అయినా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. టి.నరసాపురం మండలం శ్రీరామవరంలోని ఒక గార్డెన్లో కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన బరిని, ఫెన్సింగ్‌ను ఆదివారం ఎస్సై రాంబాబు తన సిబ్బందితో వెళ్లి తొలగించారు. మండలంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తణుకులో భారీస్థాయిలో ఏర్పాట్లు తణుకు క్రైం, తణుకు రూరల్, న్యూస్‌లైన్ : తణుకు మండలంలో పందేలకు నిర్వాహకులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తేతలి, వేల్పూరు, దువ్వ, మండపాక గ్రామాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఇక్కడ సుమారు రూ.5 కోట్ల మేర చేతులు మారనున్నట్టు అంచనా. ఇప్పటికే పందేల రాయుళ్లు రూ.10 వేల నుంచి రూ.50 వేలు విలువ చేసే కోళ్లను కొనుగోలు చేసి బరిలో దింపేందుకు సిద్ధం చేశారు. పోలీసులకు ఏటా లక్షలాది రూపాయిల నజరానాతోపాటు ఉన్నతస్థాయిలోని నాయకులకు కోజా (పందెం చనిపోయిన పుంజు)ల మాంసాన్ని భారీగా పంపుతుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా పందేలకు అనుమతులు ఉండవని చెబుతూనే అనుమతి ఇవ్వడం అధికారులకు ఆనవాయితీనేనని నిర్వాహకులు చెబుతుండడం విశేషం. మండలంలోని పందేలను తిలకించేందుకు సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం రానున్నట్టు సమాచారం. -
పల్లెల్లో కోడిపందేలకు రంగం సిద్ధం
సాక్షి, ఒంగోలు: సంక్రాంతి సందర్భంగా పల్లెల్లో ఏటా కోడి పందేలు నిర్వహించడం సర్వసాధారణం. ఇక్కడ గోదావరి జిల్లాల్లా కాకున్నా పందేల నిర్వహణకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో కోడి పందేలు జరగకుండా చూసేందుకు పోలీసులు ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేశారు. పండగ రోజుల విషయం అటుంచితే ఆదివారాలు జిల్లాలో అక్కడక్కడా కోడి పందేలు నిర్వహించడం మామూలే. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సమీపంలో ఉన్న వాగులోకి దూకడంతో ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు ఓవైపు గట్టి చర్యలు చేపడుతున్నా మరోవైపు ఎలాగైనా పందేలు నిర్వహించేలా పలువురు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. జిల్లాలోని గిద్దలూరు, కందుకూరు, పామూరు, కనిగిరి, పొదిలి, చీరాల, టంగుటూరు, కొత్తపట్నం, అద్దంకి, మార్కాపురం, తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశాలున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం ఇక్కడకు పందెంరాయుళ్లు చేరుకుని రూ. లక్షల్లో బెట్టింగులు పెడుతుంటారు. మరోవైపు పందేల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన పలు రకాల కోళ్లును సంబంధిత వ్యక్తులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచడమేకాకుండా అవి సమరంలో అన్నివిధాలా ముందంజలో ఉండేలా తర్ఫీదు ఇస్తున్నారు. రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు పందెం కోళ్లకు గిరాకీ ఉంది. పండు డేగ, నెమలి డేగ, తెల్ల కాకి, కాకి డేగ, మైలుకోడి, రసంగి, పూలకోడి, పచ్చ నెమలి తదితర రకాల కోళ్లకు కత్తులు కట్టి మరీ కథన రంగంలోకి దింపుతుంటారు. ఇవిగో.. శిబిరాలు ముఖ్యంగా గ్రామాల్లో శివారు ప్రాంతాలు, సరుగుడు తోటలు, పొలాలు, రొయ్యల చెరువులు, ఏటి గట్ల వద్ద పందేలు జరుగుతుంటాయి. రాజకీయ నేతలు సైతం ఈ పందేలను ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా వారు కూడా పాల్గొంటుండటం మామూలై పోయింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో, రాచర్ల మండలం అక్కపల్లె, అనుమలవీడు సమీపంలోని తిప్పలలో, కంభం మండలం తురిమెళ్ల గుండ్లకమ్మ వాగు సమీపంలోని చెట్లలో, కొరిశపాడు మండలం తమ్మవరం, ఎర్రబాలెం గ్రామాల్లో, ముండ్లమూరు నూజెళ్లపల్లి తండా ప్రాంతాల్లో, సుబాబుల్ తోటల్లో, సామాజిక అడవుల్లో, అద్దంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయపాలెంలలో, బల్లికురవ మండలం వెలమవారిపాలెం, సంతమాగులూరు మండలం చవటపాలెం, దర్శి మండలం కొత్తపల్లి, కొర్లమడుగు శివారు ప్రాంతాలలో, కురిచేడు మండలం కురిచేడు పెద్ద చెరువు, కొండ ప్రాంతాల్లో, దొనకొండ మండలం కొచ్చెర్లకోట, తెల్లబాడు, తాళ్లూరు మండలం శివరాంపురం శివారు ప్రాంతాలలో, అద్దంకి మండలం పేరాయపాలెం శివార్లలో, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ, కనమళ్ల, పాకల, ఊళ్లపాలెం గ్రామాలలో, మర్రిపూడి మండలం ధర్మవరం, కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం సముద్రపు ఒడ్డున గల సరుగు తోటల్లో, మడనూరు సమీపంలోని జీడి చెట్లలో, బీరంగుంటలోని రొయ్యల చెరువుల వద్ద, రాజుపాలెం, గుడ్లూరు మండలం దారకంపాడు పొలాల్లో, లింగసముద్రం మండలం పెదపవని ఏటి గట్టు పొలాల్లో, కందుకూరు మండలం పలుకూరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జె.పంగులూరు మండలంలో గతంలో కోడి పందేలు నిర్వహించినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. -
కోడి పందేలకు సర్వం సిద్ధం
సాక్షి, కొత్తగూడెం: ఓవైపు సంక్రాంతి సందడి.. మరోవైపు కోడి పందేల పర్వం జిల్లాలో ఊపందుకుంది. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఈ పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మొదలయ్యే పందేల్లో రూ.కోట్లు చేతులు మారే అవకాశం ఉంది. అయితే ఈ పందేలపై నిషేధం ఉన్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంక్రాంతి సమయంలో పంటలు చేతికొచ్చి అందరివద్దా డబ్బు సమృద్ధిగా ఉంటుంది. ఇది పందేం రాయుళ్లకు ‘పండుగ’లా మారింది. జిల్లాలో ప్రతిసారి ఈ పందేలపై నిఘా పెడుతున్నట్లు పోలీసులు ఆర్భాటం చేస్తున్నా.. పందెం రాయుళ్లు మాత్రం పందేల నిర్వహణకు రహస్యంగా తోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గతనెలలో కొత్తగూడెం మండలం సీతంపేటలోనూ పందెం కోసం పెంచుతున్న సుమారు 11 కోళ్లను పోలీసులు పట్టుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. గతంలో ఈ పందేలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామాల్లో మాత్రమే జరిగేవి. అయితే పోలీసుల నిఘా వైఫల్యంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా జిల్లా అంతటా ఈ పందేలను గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, చింతూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలో మామిడి, ఇతర తోటల్లో పందేల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా వేదికలను సిద్ధం చేశారు. పందెంరాయుళ్లు ఇక్కడ మూడురోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయడం గమనార్హం. చేతులు మారనున్న రూ.కోట్లు కోళ్ల పందెం నిర్వాహకులకు జిల్లాలోని అధికార పార్టీ నేతల సహకారం ఉండటంతో వారు యథేచ్చగా ఏర్పాట్లు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికలనే చాలామంది పందెంరాాయుళ్లు ఎంచుకున్నట్లు సమాచారం. కాగా నిర్వాహకులు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికార పార్టీ నేతలకు విన్నవించుకున్నట్లు తెలిసింది. దీంతో అంతటా పందెంకోళ్ల జోరు ఊపందుకుంది. పందాలు వేసే స్థలం(బిర్రు)లో కూర్చునేందుకు ‘వీఐపీ’, ‘వీవీఐపీ’ల పేరిట పాసులు కూడా పంపిణీ చేస్తున్నారు. భద్రాచలం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలతోపాటు కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి వేల సంఖ్యలో ఇక్కడికి పందెంరాయుళ్లు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. రూ. వేల నుంచి రూ.కోట్ల వరకు ఈ పందేల్లో చేతులు మారనున్నాయి. బికారి లక్షాధికారి కూడా అయ్యే అవకాశం ఈ పందెంలో ఉంది. పందెంలో పాల్గొనేవారు పదిరోజుల క్రితమే డబ్బు భారీ ఎత్తున సమకూర్చుకున్నట్లు తెలిసింది. మందు.. విందు.. కోడి పందెం మజా రావాలంటే మందు, విందుకూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం పందేల నిర్వహణకు తోటల్లో లైట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు పందెం ముసుగులో పేకాటకు కూడా పెద్ద ఎత్తు న ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా బిర్యా నీ వంటకాలు, మద్యం కూడా పందెం వేదికల వద్ద రహస్యంగా విక్రయించేందుకు వ్యాపారులు సన్నద్ధమైనట్లు సమాచారం. పోలీసులు ఒకవైపు నిఘా పెట్టామని చెబుతున్నా పందెంరాయుళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ పందెం దందాకు చెక్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే. -
కోడి పందేలు నిర్వహిస్తున్న 9 మంది అరెస్ట్
ఖమ్మం రూరల్ న్యూస్‌లైన్: ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్ గ్రామ శివారులో బుధవారం కోడి పందాలు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అంబలి శ్రీనివాస్, కృష్ణా జిల్లాకు షేక్ అలీషరీఫ్,షేక్ రహీం, ఖమ్మానికి చెందిన గుడ్డి జానకిరాములు,షేక్ బాబు, జక్కుల ఆంజనేయులు, కంచపు వీరబాబు, కడలి బాలయోగి వరంగల్ జిల్లాకు చెందిన కొండి విష్ణు కామంచికల్ గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మరికొందరు పారిపోయారు. వీరి వద్ద నుంచి 21 పందెం కోళ్లు, 11 సెల్ఫోన్లు, 13 మోటార్‌బైక్‌లు, ఒక కారు, ఒక ఆటో, రూ.8,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో భారీగా డబ్బు చేతులు మారినట్లు, గత కొంతకాలంగా ఇక్కడ కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు తమ దృస్టికి వచ్చిందని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.