127 మంది జూదరుల అరెస్ట్ | 127 people arrested for gamblers | Sakshi
Sakshi News home page

127 మంది జూదరుల అరెస్ట్

Published Thu, Jan 16 2014 5:39 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

127 people arrested for gamblers

సంతమాగులూరు, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా పేకాట, కోడిపందేల శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 127 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి పందెంకోళ్లతో పాటు అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
 
 సంతమాగులూరు మండలంలో 35 మంది...
 సంక్రాంతి సందర్భంగా మండలంలోని గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న వారితో పాటు పేకాటాడుతున్న మొత్తం 35 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 61,000 రూపాయల నగదు, ఆరు పందెంకోళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఎ.శివనాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామాల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలపై నిఘా పెట్టిన పోలీసులు.. వారికి అందిన సమాచారం మేరకు మండలంలోని బండివారిపాలెం, కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌కాలనీల్లో కోడిపందేల శిబిరాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. రెండు శిబిరాల్లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 26,000 రూపాయల నగదుతో పాటు ఆరు పందెంకోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఏల్చూరు, కొప్పరం, బండివారిపాలెం, కొమ్మాలపాడు పరిసరాల్లో పేకాట శిబిరాలపై దాడిచేసి 22 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 35,085 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను గురువారం అద్దంకి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
 
 ముండ్లమూరు మండలంలో 20 మంది...
 ముండ్లమూరు, న్యూస్‌లైన్ : మండలంలోని శంకరాపురం గ్రామంలో పేకాటాడుతున్న నలుగురిని ట్రైనీ ఎస్సై కిశోర్‌బాబు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 3,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సిబ్బంది హరికృష్ణ, మరియబాబు, వెంకటేశ్వర్లు, శ్యామ్ పాల్గొన్నారు. ఇదే మండలంలోని మారెళ్ల, కెల్లంపల్లి గ్రామాల్లో కోడిపందేల శిబిరాలపై బుధవారం దాడిచేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రైనీ ఎస్సై కిశోర్‌బాబు తెలిపారు. మారెళ్లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 13,110 రూపాయల నగదు, 12 కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కెల్లంపల్లిలో 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 8,150 రూపాయల నగదు, ఆరు కోళ్లు, 29 కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
 
 అర్ధవీడు మండలంలో 15 మంది...
 అర్ధవీడు, న్యూస్‌లైన్ : అర్ధవీడు మండలంలోని కాకర్ల శివారు ప్రాంతంలో కంపచెట్లలో పేకాటాడుతున్న 10 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యరాజ్ తెలిపారు. వారి నుంచి 11,140 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా ఈ నెల 12వ తేదీ యాచవర ంలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి 2,440 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని గిద్దలూరు కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు.
 
 చీరాల మండలంలో 39 మంది...
 చీరాల రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక జవహర్‌నగర్‌లో కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు పందెంకోళ్లు, 1,080 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేశాయిపేటలోని పేకాట శిబిరంపై దాడిచేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,100 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒన్‌టౌన్ ఎస్సై స్వామిరెడ్డి, రైటర్ డాల్ఫిన్ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. ఇదే మండలంలోని కావూరివారిపాలెం, నక్కలవారిపాలెం గ్రామాల్లో కోడిపందేల శిబిరాలపై మంగళ, బుధవారాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 2,030 రూపాయల నగదు, ఆరు పందెపు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
 
 గుడ్లూరు మండలంలో ఆరుగురు...
 గుడ్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని కొత్తపేట గ్రామంలో పేకాటాడుతున్న ఆరుగురిని ట్రైనీ ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10వేల రూపాయలు స్వాధీనం చేసు కున్నారు.నిందితులను గురువారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
 
 చెన్నిపాడులో నలుగురు...
 చెన్నిపాడు (పొన్నలూరు), న్యూస్‌లైన్ : పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్న నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఈ నారాయణ తెలిపారు.వారి నుంచి ఐదు కోళ్లు, 2,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement