అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు జోరుగా పందేలు నిర్వహిస్తున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామంలో సోమవారం మూడు కోళ్లు.. ఆరుకత్తులు అన్న చందంగా కోడిపందేలు జోరుగా సాగాయి. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పత్రికలు, లోకల్ కేబుల్ ద్వారా హెచ్చరికలు జారీచేసినా ఎమ్మెల్యే గ్రామస్తులు, అధికార పార్టీ నాయకులు ఖాతరు చేసినట్లు లేరు.. ఎంచక్కా రెండు బిర్రులు కట్టి.. కంచెలతో దడులు నిర్మించి మరీ కోడిపందేలు నిర్వహించారు. మామిళ్లవారిగూడెం- సున్నంబట్టి గ్రామాల మధ్య బీటీ రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్లేందుకు వరిమడులను చెరిపేసి బిర్రుల వరకు మార్గాన్ని శుభ్రం చేశారు. జూదరుల కోసం మద్యం, తాగునీరు, స్టఫ్‌గా కోడి పకోడి.. ఇలా అన్నింటి కీ వేలంపాట పెట్టి అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహానికి కోడిపందేల వాసన తగటడంలో మండలంలోని పలు గ్రామాల జూదరులు సున్నంబట్టి చేరుకున్నారు. ‘ఎంతెచ్చు.. ఐదెచ్చు.. పదెచ్చు.. ’ అంటూ హోరాహోరీగా పందెం కాశారు.
బడా జూదరులు పశ్చిమానికే..
పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవనే పోలీసుల ప్రకటనలు చూసి భయాందోళనకు గురయిన పెద్ద పందెగాళ్లు, పందెంలో నిపుణులైన పలువురు కుక్కుటశాస్త్రం పుస్తకాలు పట్టుకుని తెల్లవారేసరికే పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీనివాసపురం, చింతపల్లి, పోతునూరు, భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. పెద్ద పందగాళ్లు పక్క జిల్లాకు వెళ్లిపోవడంతో రూ.1000 లోపు పందెం వేసేవారు, పండుగల సమయంలో మాత్రమే ఆడేవారు స్థానికంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు.
ఊరూరా కూరపందేలు...
గిరిజన గ్రామాల్లో నగదు పందేలు వేయకుండా, కత్తులు కట్టకుండా కూర పందేలను నిర్వహిస్తున్నారు. పందెంలో పాల్గొన్న కోడిని వెంటనే కోసుకుని తినటం ఇక్కడి కొందరి ఆచారం. అదీ సంక్రాంతి పండగ నాలుగు రోజులు ఇలా సరదాగా ఊళ్లో వాళ్లంతా పందెం వేసుకుని కోళ్లను కోసుకుంటుంటారు. ఐతే కూరపందేల పేరుతో లక్షల రూపాయల జూదం కొన్ని చోట్ల జరిగింది. ఒక్కో జోడు కోళ్లు పందెంలో కత్తులు కట్టుకుని తలపడుతుంటే.. రూ.వంద నుంచి వెయ్యి దాకా బిర్రు బయట ఉండి పై పందేలు కట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అటుగా రాలేదు. అయితే పందేల జోలికి వెళ్లవద్దని ఉన్నతాధికారుల నుంచి వారికి ఆదేశాలు వచ్చి ఉంటాయని పలువురు అనుమానం వ ్యక్తం చేస్తున్నారు.
లింగగూడెంలో జోరుగా...
పెనుబల్లి : మండల పరిధిలోని లింగగూడెంలో సోమవారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు. గ్రామ శివారు వావిళ్లపాడులోని ఓ మామిడి తోటకు వందకుపైగా పుంజులను తీసుకొచ్చి వేలాది రూపాయలు పెట్టి పందేలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ తతంగమంతా పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే కావడం గమనార్హం. కోడి పందేలు నిర్వహిస్తారనే అనుమానంతో సంక్రాంతికి ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
‘పుంజు’కుంటున్న కోడి పందేలు
Published Tue, Jan 14 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement