సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. బుధవారం జరిగిన వాగ్వాదం.. చివరకు కుర్చీలు విసురుకొని కొట్టుకునే వరకు వచ్చింది. ఈ గొడవతో చిర్రెత్తుకొచ్చిన సీనియర్ నేత రేణుకా చౌదరి.. దవడ పగలకొడతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో రసాభస నెలకొంది. మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరితో పాటు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్,సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్ హాజరయ్యారు.
ఈ క్రమంలో మట్టా దయానంద్, మానవతరాయ్ వర్గాలకు సంబంధించిన అనుచరులు తమ నేతకు టికెట్ కేటాయించాలంటే తమ నేతకు టికెట్ కేటాయించాలని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమకే టికెట్ రావాలని మానవతారాయ్ వర్గానికి సంబంధించిన అనుచరులు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌ను కోరారు.
అటు మట్ట దయానంద్ వర్గం కూడా తమకే టికెట్ కేటాయించాలని సూచించడంతో పరస్పరం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. రెండు వర్గాలు ఒకరికొకరు కుర్చీలు విసురుకోవడంతో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి..తో సమావేశం మధ్యలో నుంచే రేణుక చౌదరి వెళ్లిపోయారు. అనంతరం ఆమె ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో ప్రెస్ మీట్ పెట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఇంకోసారి గొడవపడితే ఊరుకోం. గొడవపడితే నేనే దవడ పగలకొడతా. కార్యకర్తల బలంలేని నాయకులే ఎక్కువగా మొరుగుతారు’’ అంటూ తీవ్ర స్థాయిలో గ్రూప్ రాజకీయాలపై మండిపడ్డారామె.
మరోవైపు ఇప్పటికే సత్తుపల్లి కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. కొండూరు సుధాకర్, మానవతారాయ్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖ, మట్టా దయానంద్ టికెట్ తనకొస్తుందంటే తనకొస్తుందని ధీమాతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment