సాక్షి, కొత్తగూడెం: ఓవైపు సంక్రాంతి సందడి.. మరోవైపు కోడి పందేల పర్వం జిల్లాలో ఊపందుకుంది. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఈ పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మొదలయ్యే పందేల్లో రూ.కోట్లు చేతులు మారే అవకాశం ఉంది. అయితే ఈ పందేలపై నిషేధం ఉన్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సంక్రాంతి సమయంలో పంటలు చేతికొచ్చి అందరివద్దా డబ్బు సమృద్ధిగా ఉంటుంది. ఇది పందేం రాయుళ్లకు ‘పండుగ’లా మారింది. జిల్లాలో ప్రతిసారి ఈ పందేలపై నిఘా పెడుతున్నట్లు పోలీసులు ఆర్భాటం చేస్తున్నా.. పందెం రాయుళ్లు మాత్రం పందేల నిర్వహణకు రహస్యంగా తోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గతనెలలో కొత్తగూడెం మండలం సీతంపేటలోనూ పందెం కోసం పెంచుతున్న సుమారు 11 కోళ్లను పోలీసులు పట్టుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. గతంలో ఈ పందేలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామాల్లో మాత్రమే జరిగేవి.
అయితే పోలీసుల నిఘా వైఫల్యంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా జిల్లా అంతటా ఈ పందేలను గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, చింతూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలో మామిడి, ఇతర తోటల్లో పందేల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా వేదికలను సిద్ధం చేశారు. పందెంరాయుళ్లు ఇక్కడ మూడురోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయడం గమనార్హం.
చేతులు మారనున్న రూ.కోట్లు
కోళ్ల పందెం నిర్వాహకులకు జిల్లాలోని అధికార పార్టీ నేతల సహకారం ఉండటంతో వారు యథేచ్చగా ఏర్పాట్లు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికలనే చాలామంది పందెంరాాయుళ్లు ఎంచుకున్నట్లు సమాచారం. కాగా నిర్వాహకులు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికార పార్టీ నేతలకు విన్నవించుకున్నట్లు తెలిసింది. దీంతో అంతటా పందెంకోళ్ల జోరు ఊపందుకుంది. పందాలు వేసే స్థలం(బిర్రు)లో కూర్చునేందుకు ‘వీఐపీ’, ‘వీవీఐపీ’ల పేరిట పాసులు కూడా పంపిణీ చేస్తున్నారు. భద్రాచలం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలతోపాటు కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి వేల సంఖ్యలో ఇక్కడికి పందెంరాయుళ్లు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. రూ. వేల నుంచి రూ.కోట్ల వరకు ఈ పందేల్లో చేతులు మారనున్నాయి. బికారి లక్షాధికారి కూడా అయ్యే అవకాశం ఈ పందెంలో ఉంది. పందెంలో పాల్గొనేవారు పదిరోజుల క్రితమే డబ్బు భారీ ఎత్తున సమకూర్చుకున్నట్లు తెలిసింది.
మందు.. విందు..
కోడి పందెం మజా రావాలంటే మందు, విందుకూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం పందేల నిర్వహణకు తోటల్లో లైట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు పందెం ముసుగులో పేకాటకు కూడా పెద్ద ఎత్తు న ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా బిర్యా నీ వంటకాలు, మద్యం కూడా పందెం వేదికల వద్ద రహస్యంగా విక్రయించేందుకు వ్యాపారులు సన్నద్ధమైనట్లు సమాచారం. పోలీసులు ఒకవైపు నిఘా పెట్టామని చెబుతున్నా పందెంరాయుళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ పందెం దందాకు చెక్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే.