ఘనంగా రామయ్య రథోత్సవం | Ramaiah a grand chariot festivals | Sakshi
Sakshi News home page

ఘనంగా రామయ్య రథోత్సవం

Published Thu, Jan 16 2014 6:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

Ramaiah a grand chariot festivals

భద్రాచలం టౌన్ , న్యూస్‌లైన్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి వైభవంగా ర థోత్సవం నిర్వహించారు. విద్యుత్ కాంతుల ధగ ధగలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శ్రీరామనామ స్మరణల మధ్య ప్రత్యేకంగా తయారుచేసిన విజయరథంలో తమ ఇళ్ల ముందుకు వచ్చిన రామయ్యను దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా  ఈ వేడుక నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భద్రాచలం దేవస్థానంలో భోగి పండుగను మంగళవారం, సంక్రాంతి వేడుకలను బుధవారం నిర్వహించారు.
 
 ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు కావటం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం రోజు కావటంతో ఈ ఉత్సవానికి విశిష్ట ప్రాముఖ్యత ఉందని వేద పండితులు చెపుతున్నారు. ఆలయానికి వచ్చి దర్శించుకోలేని భక్తుల కోసం శ్రీ సీతారామచంద్రస్వామి వారు స్వయంగా భక్తుల కోరికలు తీర్చేందుకు చేసే పర్యటనలో భాగమే రథోత్సవం అని వారు వివరించారు. తొలుత ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి ప్రత్యేక పల్లకిలో తీసుకొచ్చి బేడా మండపంలో ఉంచారు. ఈ సందర్భంగా అభిషేకం, విష్వక్సేణ పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పల్లకిలో ఆశీనులైన స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, నివేదన ఇచ్చారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రామాలయం నుంచి తాతగుడి సెంటర్ వరకూ ఈ రథోత్సవం సాగింది. అనంతరం స్వామి వారు తిరిగి ఆలయానికి చేరకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమా చార్యులు, సన్యాసిశర్మ, ఏఈవో శ్రవణ్‌కుమార్, పీఆర్‌వో సాయిబాబ, ఆలయ అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement