సాక్షి, ఒంగోలు: సంక్రాంతి సందర్భంగా పల్లెల్లో ఏటా కోడి పందేలు నిర్వహించడం సర్వసాధారణం. ఇక్కడ గోదావరి జిల్లాల్లా కాకున్నా పందేల నిర్వహణకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో కోడి పందేలు జరగకుండా చూసేందుకు పోలీసులు ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేశారు. పండగ రోజుల విషయం అటుంచితే ఆదివారాలు జిల్లాలో అక్కడక్కడా కోడి పందేలు నిర్వహించడం మామూలే. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సమీపంలో ఉన్న వాగులోకి దూకడంతో ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు ఓవైపు గట్టి చర్యలు చేపడుతున్నా మరోవైపు ఎలాగైనా పందేలు నిర్వహించేలా పలువురు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. జిల్లాలోని గిద్దలూరు, కందుకూరు, పామూరు, కనిగిరి, పొదిలి, చీరాల, టంగుటూరు, కొత్తపట్నం, అద్దంకి, మార్కాపురం, తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశాలున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం ఇక్కడకు పందెంరాయుళ్లు చేరుకుని రూ. లక్షల్లో బెట్టింగులు పెడుతుంటారు. మరోవైపు పందేల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన పలు రకాల కోళ్లును సంబంధిత వ్యక్తులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచడమేకాకుండా అవి సమరంలో అన్నివిధాలా ముందంజలో ఉండేలా తర్ఫీదు ఇస్తున్నారు. రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు పందెం కోళ్లకు గిరాకీ ఉంది. పండు డేగ, నెమలి డేగ, తెల్ల కాకి, కాకి డేగ, మైలుకోడి, రసంగి, పూలకోడి, పచ్చ నెమలి తదితర రకాల కోళ్లకు కత్తులు కట్టి మరీ కథన రంగంలోకి దింపుతుంటారు.
ఇవిగో.. శిబిరాలు
ముఖ్యంగా గ్రామాల్లో శివారు ప్రాంతాలు, సరుగుడు తోటలు, పొలాలు, రొయ్యల చెరువులు, ఏటి గట్ల వద్ద పందేలు జరుగుతుంటాయి. రాజకీయ నేతలు సైతం ఈ పందేలను ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా వారు కూడా పాల్గొంటుండటం మామూలై పోయింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో, రాచర్ల మండలం అక్కపల్లె, అనుమలవీడు సమీపంలోని తిప్పలలో, కంభం మండలం తురిమెళ్ల గుండ్లకమ్మ వాగు సమీపంలోని చెట్లలో, కొరిశపాడు మండలం తమ్మవరం, ఎర్రబాలెం గ్రామాల్లో, ముండ్లమూరు నూజెళ్లపల్లి తండా ప్రాంతాల్లో, సుబాబుల్ తోటల్లో, సామాజిక అడవుల్లో, అద్దంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయపాలెంలలో, బల్లికురవ మండలం వెలమవారిపాలెం, సంతమాగులూరు మండలం చవటపాలెం, దర్శి మండలం కొత్తపల్లి, కొర్లమడుగు శివారు ప్రాంతాలలో, కురిచేడు మండలం కురిచేడు పెద్ద చెరువు, కొండ ప్రాంతాల్లో, దొనకొండ మండలం కొచ్చెర్లకోట, తెల్లబాడు, తాళ్లూరు మండలం శివరాంపురం శివారు ప్రాంతాలలో, అద్దంకి మండలం పేరాయపాలెం శివార్లలో, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ, కనమళ్ల, పాకల, ఊళ్లపాలెం గ్రామాలలో, మర్రిపూడి మండలం ధర్మవరం, కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం సముద్రపు ఒడ్డున గల సరుగు తోటల్లో, మడనూరు సమీపంలోని జీడి చెట్లలో, బీరంగుంటలోని రొయ్యల చెరువుల వద్ద, రాజుపాలెం, గుడ్లూరు మండలం దారకంపాడు పొలాల్లో, లింగసముద్రం మండలం పెదపవని ఏటి గట్టు పొలాల్లో, కందుకూరు మండలం పలుకూరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జె.పంగులూరు మండలంలో గతంలో కోడి పందేలు నిర్వహించినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
పల్లెల్లో కోడిపందేలకు రంగం సిద్ధం
Published Mon, Jan 13 2014 3:45 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement