గెలుపెవరిదో..!
Published Mon, Jan 13 2014 4:32 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
జంగారెడ్డిగూడెంరూరల్/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలకు జిల్లావ్యాప్తంగా బరులు సిద్ధమయ్యాయి. కోళ్లతో పందెం రాయుళ్లూ సిద్ధమయ్యారు. పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. పందాలు వేసి జూదరులు గెలుస్తారా.. వాటిని అడ్డుకుని పోలీసులు గెలుస్తారా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. పందేలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడాబాబులు జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి నెల రోజుల క్రితమే నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా తాము అన్నీ చూసుకుంటామంటూ హామీలు ఇవ్వడంతో పారిశ్రామిక, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. జిల్లాలోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఆచంట, తణుకు తదితర ప్రాంతాల్లో భారీగా పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
పందేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని, చివరిలో అనుమతి ఖాయమనే ధీమాతో నిర్వాహకులు ఉన్నారు. సంక్రాంతి మూడు రోజులూ జరిగే పందేల జాతరలో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాల నిర్వహణకు రెండు వర్గాల వారు పోటాపోటీగా బరిలు సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ హరికృష్ణ ఆదేశాల మేరకు శ్రీనివాసపురంలోని బరిలపై పోలీసులు దాడులు చేసి ఫెన్సింగ్‌లను తొలగించారు. అయినా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. టి.నరసాపురం మండలం శ్రీరామవరంలోని ఒక గార్డెన్‌లో కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన బరిని, ఫెన్సింగ్‌ను ఆదివారం ఎస్సై రాంబాబు తన సిబ్బందితో వెళ్లి తొలగించారు. మండలంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తణుకులో భారీస్థాయిలో ఏర్పాట్లు
తణుకు క్రైం, తణుకు రూరల్, న్యూస్‌లైన్ : తణుకు మండలంలో పందేలకు నిర్వాహకులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తేతలి, వేల్పూరు, దువ్వ, మండపాక గ్రామాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఇక్కడ సుమారు రూ.5 కోట్ల మేర చేతులు మారనున్నట్టు అంచనా. ఇప్పటికే పందేల రాయుళ్లు రూ.10 వేల నుంచి రూ.50 వేలు విలువ చేసే కోళ్లను కొనుగోలు చేసి బరిలో దింపేందుకు సిద్ధం చేశారు. పోలీసులకు ఏటా లక్షలాది రూపాయిల నజరానాతోపాటు ఉన్నతస్థాయిలోని నాయకులకు కోజా (పందెం చనిపోయిన పుంజు)ల మాంసాన్ని భారీగా పంపుతుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా పందేలకు అనుమతులు ఉండవని చెబుతూనే అనుమతి ఇవ్వడం అధికారులకు ఆనవాయితీనేనని నిర్వాహకులు చెబుతుండడం విశేషం. మండలంలోని పందేలను తిలకించేందుకు సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం రానున్నట్టు సమాచారం.
Advertisement