సాక్షి, కొత్తగూడెం: కోడి పందేలను కట్టడి చేస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. అశ్వారావుపేట, భద్రాచలం నియోకజక వర్గాల్లో సంక్రాంతి మూడురోజులూ పందేల నిర్వహణకు అడ్డులేకుండా పోయింది. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పందేలకు సహకరించడంతో పాటు వారు కూడా బెట్టింగ్‌లో పాల్గొనడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారనే ఆరోపణలున్నాయి. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో బహిరంగంగా రెండు బిర్రులు కట్టి అధికార పార్టీ నాయకులు కోడిపందేలు నిర్వహించడం గమనార్హం. ఇక్కడ వెయ్యిరూపాయలలోపు పందెం ఉండదు. దీంతో ఇక్కడ వేలు, లక్షల్లో పందేలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేలకు అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్తుపల్లి ప్రాంతం నుంచి పందెం రాయుళ్లు హుషారుగా తరలి వెళ్లారు. చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, కళ్లచెరువు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పందేలలో జిల్లావాసులు పాల్గొన్నారు.
భద్రాచలం ఏజెన్సీలోనూ జోరు..
భద్రాచలం ఏజెన్సీలోనూ కోడిపందేలు జోరుగా సాగాయి. జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారితో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడి పందేలకు తరలివచ్చారు. చర్ల మండలంలోని రాళ్లగూడెం, కలివేరు, చింతగుప్ప, గన్నవరంకాలనీ సుబ్బంపేట తదితర గ్రామాల శివారు అటవీ ప్రాంతాలలో ముమ్మరంగా కోడిపందేలు నిర్వహించారు. వెంకటాపురం మండలంలోని ఉప్పేడు, బెస్తగూడెం, కోయబెస్తగూడెం, పాత్రాపురం గ్రామాల్లోనూ పందేలు సాగాయి. రూ. 2 వేల నుంచి రూ.10 వేల వరకూ బెట్టింగ్ పెట్టారు. అలాగే దుమ్ముగూడెం మండలంలోని గడ్డోరుగట్ట, జిన్నెలగూడెం, దబ్బనూతల గ్రామాలు, చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, మోతుగూడెం, చిడుమూరు, వీఆర్‌పురం మండలంలో చింతరేవుపల్లితో పాటు మండల కేంద్రం శివారు ప్రాంతంలో ముమ్మరంగా కోడి పందేలు సాగాయి. భద్రాచలం మండలంలోని పట్టుచీర, కొండేపల్లి, ఎర్రగట్ట, విస్సాపురం తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి.
పై పందేల జోరు..
పందెంరాయుళ్లు కట్టే పందేనికి అదనంగా పైపందేలు నిర్వహించారు. బిర్రి లోపల వారి సంబంధీకులు, సన్నిహితులను అనుమతించగా.. ఇరుపక్షాలు తరపువారు పైపందేలు కట్టారు. పందేలను చూడటానికి వచ్చిన వారు బిర్రి బయట నిలుచుని జోరుగా పందేలు నడిపారు. లోపల పందేనికి వంద రెట్లు పైపందేలు, బయటి పందేలు నడుస్తాయి. బిర్రి లోపలి పందెం రూ. వెయ్యి నడిస్తే పైపందేలు, బయట పందేలు రూ. లక్ష వరకు జరిగాయి. ఇలా సోమవారం మొదలుకొని బుధవారం వరకు కోట్ల రూపాయలలో కోడిపందేలు నిర్వహించారు. దీనికి తోడు పేకాట(నలుపు, తెలుపు), గుండుపట్టాలు నిర్వహించుకునేందుకు, మద్యం దుకాణాలు నడుపుకునేందుకు నిర్వాహకులు ఆయా వ్యక్తుల నుంచి భారీగానే సొమ్ములు వసూలు చేశారు.
మందేసి.. చిందులు..
పందేల్లో పాల్గొన్న వారు సొమ్ములు వచ్చినా, పోయినా తప్పతాగి చిందులు వేశారు. వ్యాపారులు కూలింగ్ లేని బీర్ రూ. 140, చీప్‌లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ. 120 చొప్పున అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అంతేకాకుండా పందెం ప్రాంతంలో వడ్డీ వ్యాపారుల హవా కొనసాగింది.పందెంలో చేతులు కాల్చుకున్న వారు తెచ్చిన డబ్బు అయిపోవడంతో తమకు తెలిసిన వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకొని మరీ పందెంలో పాల్గొన్నారు. మొత్తంగా పందెంరాయుళ్లు ఈసారి పెద్ద ఎత్తున చెలరేగిపోవడానికి పోలీసులు చూసీచూడనట్లు వదిలివేయడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కోడి పొడిచింది... ఖాకీ నిద్దరోయింది!
Published Thu, Jan 16 2014 5:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement