రూ. 300 కోట్లు కొక్కొరొకో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి జిల్లాల్లో భోగి పండుగ రోజు మొదలైన కోడిపందేలు మకర సంక్రాంతి నాడు తారాస్థాయికి చేరుకుని కనుమరోజు రాత్రి పొద్దుపోయేవరకు జోరుగా సాగాయి. ఈ మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగిన పందేలలో సుమారుగా రూ.300 కోట్ల వరకు చేతులు మారాయని అంచనా. హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజా ప్రతినిధుల అండతో మొదలైన కోడిపందేలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జాతరల మాదిరిగా కొనసాగాయి. పందెం బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టుషాపులు వెలిశాయి. కోడి పందేలు, పేకాటల్లో కోట్లల్లో డబ్బు చేతులు మారగా గుండాట, కోతాటల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి.
చేతులు మారిన రూ.300 కోట్లు
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.300 కోట్లు చేతులు మారినట్లు అంచనా. అందులో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారుగా రూ.250 కోట్ల మేర పందేలు సాగినట్లు తెలుస్తోంది. ఎక్కువ బరులు ఏర్పాటైన చింతలపూడి నియోజకవర్గంలోనే సుమారు రూ.100 కోట్లకు పైబడి పందేలు, జూదాలు జరిగినట్టు సమాచారం.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పందేలకు అనుమతులివ్వక పోవడంతో సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంపై ఆ ప్రభావం కనిపించింది. తెలంగాణకు చెందిన వేలాదిమంది కార్లు, బైకులపై ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులవైపు ప్రయాణం కట్టారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద రాయలసీమ ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కనిపించారు. ఈ మూడురోజుల్లో జరిగిన పందేలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు శివకృష్ణ, జబర్దస్త్ కార్యక్రమంలోని పలువురు నటులు పాల్గొన్నారు.
మరో రోజు అనుమతికి యత్నాలు
మూడు రోజులూ అనధికార అనుమతులతో జోరుగా పందేలు నిర్వహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముక్కనుమ రోజైన ఆదివారం కూడా పందేలను నిర్వహించడానికి పోలీసు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఐతే పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.