పేట్రేగిపోతున్న పేకాటరాయుళ్లు
* పల్లె పట్టణం తేడా లేకుండా కొనసాగుతున్న ఆట
* వీరి కోసమే ప్రత్యేకంగా హోటళ్లు
* బలవుతున్న కుటుంబాలు
* నామమాత్రపు చర్యలకు పరిమితమవుతున్న పోలీసులు
పరిగి: గ్రామాలు, పట్టణాలు అని తేడాలేకుండా పేకాట రాయుళ్లు విజృంభిస్తున్నారు. పేకాటకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువకులు, పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ ఆట మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మండల పరిధిలోని సుల్తాన్‌పూర్, మల్లెమోనిగూడ, సయ్యద్‌పల్లి, రాఘవాపూర్ తదితర గ్రామాల్లో పేకాటరాయుళ్ల సంఖ్య అధికంగా ఉంది. గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న వారి కోసమే కొన్ని హోటళ్లు వెలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత..
పేకాట కుటుంబాలను చిద్రం చేయడమే కాకుండా కొందరి ప్రాణాలు కూడా బలిగొంటోంది. ఇటీవల పరిగిలో పేకాట ఆడేచోట తలెత్తిన వివాదంలో ఓ యువకుడు హత్యకు గురికాగా.. అదే కేసులో అనుమానితుడు ఆ వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి గొడవలు అనేకం చోటుచేసుకుంటునా బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. దాబాలు, శివారుల్లోని చెట్లు, రచ్చబండలు, పాఠశాల వరండాలు పేకాట రాయుళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి.
నామమాత్రపు దాడులు
గ్రామాల్లో పేకాటతో శాంతిభద్రతల సమస్య కూడా వచ్చి పడుతోంది. లక్షాధిపతులు బికారులుగా మారుతుండగా పేదలు భార్యల మెడల్లో ఉన్న పుస్తెలతాళ్లు అమ్ముకున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా పేకాటను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా పోలీసులు దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
పేకాట ఆడుతున్న వారిలో అధికులు బడానాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతకుటుంబాలకు చెందిన వారుంటుండటంతో దాడులు చేసిన ప్రతిసారి పోలీసులపై కూడా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా పేకాట రాయుళ్లపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పకడ్బందీ చర్యలు తీసుకుంటే తప్పా పేకాటకు స్వస్తి పలికే అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు.