పండుగపూట పేకాట జోరు
* ఫలించని పోలీసుల హెచ్చరికలు
* చేతులు మారిన కోట్ల రూపాయలు
* జిల్లా వ్యాప్తంగా 286 కేసులు
* దీపావళి రోజే రూ. 16 లక్షలు స్వాధీనం
* చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం : దీపావళి పండుగ సందర్భంగా పేకాట మూడు ముక్కలు ఆరు ఆటలుగా సాగింది. పండుగ సందర్భంగా పేకాటపై పోలీసులు నిషేధం విధించినా ఫలితం లేకుండా పోయింది. కేసులు నమోదు చేసి వారి పేర్లు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో పెడతామని పోలీసులు చేసిన హెచ్చరికలు పేకాటరాయుళ్లు పెడచెవిన పెట్టారు. పండుగ రోజు రాత్రే కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసుల కళ్లుగప్పి అనేక స్థావరాల్లో పేకాట ఆడారు. అయితే పోలీసులు చాలా స్థావరాలపై దాడులు చేసి అరెస్టులు చేశారు. జిల్లాలో దీపావళి రోజున 286 కేసుల్లో 1,492 మందిని అరెస్టు చేసి రూ. 16లక్షల 29వేల 235 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షాత్తు పోలీస్ బాస్ నివాసం ఉండే జిల్లా కేంద్రంలోనే 350 మందిని అదుపులోకి తీసుకుని దాదాపు రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకోవటమే ఇందుకు నిదర్శనం.
తెలిసి వదిలేశారా..?
పేకాట ఇంత జోరుగా సాగినా పోలీసులు అంతగా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా పేకాటాడే వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పోలీసులు తమకు తెలిసిన పేకాట స్థావరాలపై దాడులు చేయకుండానే వారు ఇచ్చిన డబ్బులు పుచ్చుకుని చూసీచూడనట్లుగా వ్యవహరించారని సమాచారం. ఇలా కొంతమంది పోలీసు సిబ్బంది బడా పేకాటరాయుళ్ల నుంచి వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వచ్చిన వాటాలో తమపై అధికారులకు సైతం వాటా ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్ సబ్ డివిజన్‌లో 120 కేసుల్లో 631 మందిని పట్టుకుని రూ. 5 లక్షల 95 వేల 675 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అత్యధికంగా మాత్రం నిజామాబాద్ సబ్ డివిజన్‌లో రూ. 6లక్షల 20వేల 510 నగదును స్వాధీనం చేసుకోవటం గమనార్హం.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎంపీపీ
జక్రాన్‌పల్లి : మండలంలోని పుప్పాలపల్లిలో పేకాట ఆడుతూ జక్రాన్‌పల్లి ఎంపీపీ రాజన్న, కాంగ్రెస్ నాయకుడు రమణారెడ్డితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్సై నర్సింలు శుక్రవారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి పుప్పాలపల్లిలోని కాంగ్రెస్ నాయకుడు రమణారెడ్డి ఇంట్లో పేకాట ఆడుతూ ఎంపీపీ రాజన్న, రమణారెడ్డి, రేగుంట కిషన్, పోకల్‌కర్ కిషన్, వెంకటేశ్వర్లు, సాయన్న, మహేశ్, మోహన్, ఒడ్డెన్న పట్టుబడ్డారని ఏఎస్సై చెప్పారు. వీరి వద్ద నుంచి రూ. 77 వేల 280 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా జక్రాన్‌పల్లిలో ఏడుగురు పేకాట రాయుళ్ల వద్ద నుంచి రూ. 15 వేల 300 రూపాయలు, బాలానగర్ క్యాంపులో ఏడుగురిని అరెస్టు చేసి రూ. 5790 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.