Rs. 300 crore
-
రూ. 300 కోట్లు కొక్కొరొకో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి జిల్లాల్లో భోగి పండుగ రోజు మొదలైన కోడిపందేలు మకర సంక్రాంతి నాడు తారాస్థాయికి చేరుకుని కనుమరోజు రాత్రి పొద్దుపోయేవరకు జోరుగా సాగాయి. ఈ మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగిన పందేలలో సుమారుగా రూ.300 కోట్ల వరకు చేతులు మారాయని అంచనా. హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజా ప్రతినిధుల అండతో మొదలైన కోడిపందేలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జాతరల మాదిరిగా కొనసాగాయి. పందెం బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టుషాపులు వెలిశాయి. కోడి పందేలు, పేకాటల్లో కోట్లల్లో డబ్బు చేతులు మారగా గుండాట, కోతాటల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. చేతులు మారిన రూ.300 కోట్లు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.300 కోట్లు చేతులు మారినట్లు అంచనా. అందులో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారుగా రూ.250 కోట్ల మేర పందేలు సాగినట్లు తెలుస్తోంది. ఎక్కువ బరులు ఏర్పాటైన చింతలపూడి నియోజకవర్గంలోనే సుమారు రూ.100 కోట్లకు పైబడి పందేలు, జూదాలు జరిగినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పందేలకు అనుమతులివ్వక పోవడంతో సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంపై ఆ ప్రభావం కనిపించింది. తెలంగాణకు చెందిన వేలాదిమంది కార్లు, బైకులపై ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులవైపు ప్రయాణం కట్టారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద రాయలసీమ ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కనిపించారు. ఈ మూడురోజుల్లో జరిగిన పందేలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు శివకృష్ణ, జబర్దస్త్ కార్యక్రమంలోని పలువురు నటులు పాల్గొన్నారు. మరో రోజు అనుమతికి యత్నాలు మూడు రోజులూ అనధికార అనుమతులతో జోరుగా పందేలు నిర్వహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముక్కనుమ రోజైన ఆదివారం కూడా పందేలను నిర్వహించడానికి పోలీసు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఐతే పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. -
ఫైనల్ ఇయర్‌కు ముందుగా!
రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులన్నింట్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజును ముందుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకట్రెండు రోజుల్లోనే అందుకు సంబంధించి రూ. 300 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఒత్తిళ్లు తగ్గిపోతాయని, తదుపరి విడతల్లో మిగతా విద్యార్థుల రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల యాజమాన్యాలు.. ఫీజులు చెల్లించేంత వరకు సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని మొండికేస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. రీయిం బర్స్మెంట్ జాప్యం కావటంతో సర్కారు తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రాధాన్యక్రమంలో బకాయిలను చెల్లించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.2,500 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు విడివిడిగా ఈ నిధులు విడుదల చేస్తారు. మార్చి నుంచి ఇప్పటివరకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ కింద రూ.974.36 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ 2013-14 సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజుల బకాయిలకు సరిపోయాయి. దీంతో 2015-16 స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ పథకాన్ని కొనసాగించే నిర్ణయం ఆలస్యం కావటం.. పాత బకాయిల భారం కారణంగా మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది.