రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులన్నింట్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజును ముందుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకట్రెండు రోజుల్లోనే అందుకు సంబంధించి రూ. 300 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఒత్తిళ్లు తగ్గిపోతాయని, తదుపరి విడతల్లో మిగతా విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల యాజమాన్యాలు.. ఫీజులు చెల్లించేంత వరకు సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని మొండికేస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. రీయిం బర్స్‌మెంట్ జాప్యం కావటంతో సర్కారు తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రాధాన్యక్రమంలో బకాయిలను చెల్లించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.2,500 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు విడివిడిగా ఈ నిధులు విడుదల చేస్తారు. మార్చి నుంచి ఇప్పటివరకు ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ కింద రూ.974.36 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ 2013-14 సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజుల బకాయిలకు సరిపోయాయి. దీంతో 2015-16 స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ పథకాన్ని కొనసాగించే నిర్ణయం ఆలస్యం కావటం.. పాత బకాయిల భారం కారణంగా మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది.
ఫైనల్ ఇయర్‌కు ముందుగా!
Published Thu, Aug 13 2015 3:56 AM | Last Updated on Tue, Oct 2 2018 6:27 PM
Advertisement
Advertisement