ఎమ్మెల్యేగారి ఊళ్లో బిర్రి లేదు వర్రీ...
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ‘కోడిపందేలు నిర్వహిస్తే సహించే ది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రకటించడంతో భయపడుతూ భయపడుతూ తొలిరోజు పలుచగా పందేలు వేసిన నిర్వాహకులకు ఆరోజు పోలీసుల జాడ కనిపించకపోవడంతో ధైర్యం వచ్చింది. ఇంకేముంది మిగిలిన రెండురోజులూ రెచ్చిపోయారు...భారీఎత్తున పందేలకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓమాజీ సర్పంచ్, మరో నాయకుడి ఆధ్వర్యంలో సోమవారం నుంచే పందేలు జోరుగా సాగాయి. సున్నంబట్టిలో కోడిపందేలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడంలేదని ప్రచారం జరగడంతో రెండు బిర్రుల వద్దకు వేలాదిగా జూదరులు, పైపందెగాళ్లు తరలివచ్చి పందేలు కాశారు. దమ్మపేట, కుక్కునూరు, వేలేరుపాడు, ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లోని అధికారపార్టీ కార్యకర్తలు ఆయా గ్రామాలకు చెందిన చిన్న చిన్న పందెగాళ్లను ‘ఎమ్మెల్యే గారి ఊళ్లో బిర్రి పెట్టి పందేలు వేయిస్తున్నాం.. రండి.. ప్రశాంతంగా నడుపుకోండి..’ అంటూ తీసుకువచ్చారు.
పదిశాతం కేబుల్ వసూలు....
గొప్పకోసం.. సాంప్రదాయం కోసం కోడిపందేలు నడుపుతున్నామంటూ చెప్పుకునే నాయకులు గిరిజనులను నిలువుదోపిడీ చేశారు. కోడిపందేల నిర్వహణకు ఖర్చులయ్యాయంటూ.. పదిశాతం రుసుమును కేబుల్(బిర్రి మామూలు)గా వసూలు చేశారు. దీంతో ‘ఎమ్మెల్యే స్వగ్రామంలో కోడిపందేలంటే వచ్చాం.. ఆంధ్రాలో మాదిరిగా కేబుల్ వసూలు చేసి జేబులు కత్తిరించారంటూ’ కొందరు గిరిజనులను వాపోయారు. ఆంధ్రాలోకూడా కేబుల్ వసూలు చేస్తున్నప్పటికీ.. టెంట్లు వేసి.. పందెగాళ్లకు కుర్చీలు వేసి.. మినరల్ వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నారని.. ఇక్కడ ఎర్రని ఎండలో దుబ్బలో మందకుమందలా బిర్రిలోకి వదిలి ముక్కుపిండి కేబుల్ వసూలు చేశారని వాపోతున్నారు.
జోరుగా పేకాట...
కోడిపందేలకు దీటుగా పేకాట(నలుపు, ఎరుపు), మద్యం విక్రయాలు సాగాయి. కోడిపందేల్లో పైపందేలు కాసేందుకు అవకాశం దక్కని వాళ్లు..., జేబులు ఖాళీ కాగా కొద్దోగొప్పో మిగిలిన వారు పేకాట వద్దకు గుమిగూడారు. రూ.10 నుంచి రూ.1000 వరకు నలుపు, ఎరుపు ఆటలో పెట్టారు. ఇంత బహిరంగంగా జూదం నిర్వహిస్తున్నా పోలీసులు అసలు ఆఛాయలకే రాకపోవడం చర్చనీయాంశమైంది.