కొ..క్కో..కోట్లు
- రూ.100కోట్లు చేతులు మారాయి
- యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట
- గ్రామల్లో మూడురోజుల జాతర
- అధికార పార్టీ నేతల అండ
- పోలీసుల ప్రేక్షకపాత్ర
మచిలీపట్నం : సంక్రాంతి సందర్భంగా జిల్లాలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులే స్వయంగా కోడిపందేలు, పేకాట శిబిరాలను ప్రోత్సహించడం వివాదాస్పదమైంది. మూడు రోజుల వ్యవధిలో కోడిపందేలు, పేకాట, గుండాట తదితరాల రూపంలో దాదాపు రూ. 100 కోట్లు చేతులు మారాయని అంచనా. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో ‘బరులు’ ఏర్పాటు చేయడంతో వ్యసనపరులు చేతులు కాల్చుకున్నారు. వేలాది కోళ్లు రక్తం చిందించాయి.
కోతముక్కలో పాల్గొన్న పేకాట రాయుళ్లు ఊసూరుమంటున్నారు. సంప్రదాయం ముసుగులో సాగిన ఈ పందేల వ్యవహారంలో నగదు పోగొట్టుకున్న వారే అధికశాతం ఉండడం గమనార్హం. నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పందెం, పేకాట రాయుళ్లు బరితెగించి ఈ ఏడాది తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకున్న పందెంరాయుళ్లు బరితెగించి కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది.
గత ఏడాది విజయవాడ పరిసరాల్లో కోడి పందేలు అంతగా జరగలేదు. ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా కోడిపందేల శిబిరాలు ఏర్పాటు చేయడం, అక్కడే మద్యం, భోజన వసతులు, విద్యుత్‌లైట్ల ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల కనుసన్నల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో మూడురోజుల క్రితమే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోడిపందేల శిబిరాన్ని ప్రారంభించారు. ఇక్కడ యథేచ్ఛగా కోడిపందేలు జరిగాయి. విజయవాడ రూరల్ మండలం నున్నలోనూ కోడిపందేల జోరు కొనసాగింది.
పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందుర్రులో పదెకరాల విస్తీర్ణంలో కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈ పోటీల వద్దకు వెళ్లి తిలకించడం గమనార్హం. నాగేశ్వరరావుపేటలో ఎమ్మెల్యే కాగిత స్వయంగా కోడిపందేలను ప్రారంభించారు. కోడిపందేలతో పాటు గుండాట, పేకాట యథేచ్ఛగా ఇక్కడ కొనసాగాయి. పెడన మండలం బల్లిపర్రు, కోంకేపూడి, కట్లపూడి గ్రామాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే ఉన్న మల్లెతోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట కొనసాగాయి. గూడూరు మండలంలో చిట్టిగూడూరు, పోసినవారిపాలెం, రామన్నపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున బరులు నిర్వహించారు. పేకాట జోరుగా కొనసాగింది. కృత్తివెన్ను మండలం కొమాళ్లపూడి, పోడు, చినగొల్లపాలెం, వాలంక తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు.
కైకలూరు మండలం భుజబలపట్నలో శుక్రవారం జరిగిన కోడిపందేల శిబిరాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పరిశీలించి పందేలను తిలకించారు. ముదినేపల్లి మండలం వైవాక, చిగురుకోట తదితర గ్రామాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. భుజబలపట్నంలో గుండాట భారీ ఎత్తున సాగింది. మండవల్లి మండలం చింతపాటు, బైరవపట్నం, ఇంగిలిపాకం గ్రామాల్లోనూ కోడి పందేలు, పేకాట జోరుగా సాగాయి.
నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లోని మామిడి తోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట నిర్వహించారు. కొంత మంది పందెం రాయుళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు తరలివెళ్లారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున కొనసాగాయి. మోపిదేవి మండలం చిర్లపాలెంలో కోడిపందేలు శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కోడూరు మండలం జరుగువానిపాలెంలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు.
పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలోని కారకంపాడు, గూడపాడు, మెరకనపల్లి తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు కొనసాగించారు. కూచిపూడిలో గురువారం కోడిపందేల శిబిరం వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణలకు దారి తీసింది.
గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, గుడ్లవల్లేరులలో పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. గుడివాడ పట్టణంలోనే కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో పోలాటితిప్ప, చిన్నాపురం, గుండుపాలెం, మేకవానిపాలెం గ్రామాల్లో జోరుగా కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు.
ఇదేం సంప్రదాయం
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మూడు రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, పేకాట జోరుగా కొనసాగాయి. టీడీపీ ప్రభుత్వం కోడిపందేలు, జూదాలను ప్రోత్సహించి రైతులను నిలువునా ముంచింది. ప్రభుత్వ వైఖరి కారణంగా జిల్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. సంక్రాంతి సంప్రదాయం పేరుతో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కోడిపందేలు, పేకాట శిబిరాల్లో వేలాది మంది నగదు పోగొట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్రాంతి కానుక ఇదేనా.
- నరహరిశెట్టి నరసింహారావు,డీసీసీ అధ్యక్షుడు