‘బరి’లో దేశం ఎమ్మెల్యేలు
యథేచ్ఛగా కోడి పందేలు
రేపల్లె : సంస్కృతి పేరుతో రేపల్లె నియోజకవర్గంలో జూదానికి తెరతీశారు. కోడి పందేల నిర్వహణకు సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ముందువరసలో నిలిచారు. మండలంలోని గుడ్డికాయ లంక గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కోడి పందేల ప్రత్యేక బరిలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావుల సమక్షంలో తొలిరోజు కోడి పందేలు కోలాహలంగా మొదలయ్యూరుు.
తొలి పందెం అనగాని సత్యప్రసాద్, మోదుగుల వేణుగోపాలరెడ్డి మధ్య రూ. లక్షతో మొదలైంది. అక్కడి నుంచిపోటీ పెంచుతూ తమ స్థాయిని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ప్రజాప్రతినిధులే రూ. లక్షల్లో పందేలు కాస్తుంటే జూదరులు విజృంభించారు. మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన కోడి పందేలు సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి రూ. కోటికిపైగా చేరుకుందని సమాచారం. దీంతో జూదరులు రాత్రి కూడా పందేలు నిర్వహించేందుకు బరి చుట్టూ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు.
అనుబంధంగా జూదాలు..
కోడి పందేల బరి సమీపంలో అనుంబంధ జూదాల జోరు ఊపందుకుంది. డబ్బా ఆట(జూదం), చక్రం ఆట(జూదం)లలో చిన్నారులు సైతం పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి కోడి పందేలు నిషేధం అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కసారిగా బహిరంగంగా నిర్వహిస్తుండటంతో జూదరులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోడి పందేలను ఎట్టి పరిస్థితిలో నిర్వహించనీయమని జిల్లా ఎస్పీ స్పష్టం చేసి ప్రత్యేక పోలీసు బలగాలను నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడి సీఐ పెంచలరెడ్డి ప్రత్యేక బలగాలను కోడి పందేలు నిర్వహణలేని నిజాంపట్నం పంపించారు. దీంతో మధ్యాహ్నం 12గంటలకు గుడ్డికాయలంక చేరుకున్న ప్రజాప్రతినిధులు పోలీసులు అనుమతి ఇచ్చారంటూ కోడి పందేలు ప్రారంభించారు. అసలు అనుమతి ఉందా లేదా అన్నది ఎవరికీ తెలియడం లేదు.