సాక్షి, హైదరాబాద్: ‘దేనికైనా రెడీ’ సినిమా నెగటివ్, ఫిల్మ్‌ల్లో మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్లకు ఉన్న పద్మశ్రీ పేరును తొలగించాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని వరుసగా మూడ్రోజుల పాటు పత్రికల్లో ప్రకటనల రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సినిమా టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్లకు ముందు ‘పద్మశ్రీ’ అవార్డు పేరును ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
‘దేనికైనా రెడీ’ సినిమాలో తమ పేర్ల ముందు పద్మశ్రీని వాడటంలో తమ ప్రమేయం ఏమీ లేదని నటులు ఎం.మోహన్‌బాబు, బ్రహ్మానందం హైకోర్టుకు నివేదించారు. మోహన్‌బాబు, బ్రహ్మానందం మీద గౌరవంతోనే వారి పేర్ల ముందు పద్మశ్రీ ఉపయోగిం చామే తప్ప, దానిని దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని చిత్ర నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ నివేదించింది. కేసు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.