సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు బుధవారం మరోసారి విచారించింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14లోపు ఎన్‌ఐఏకి కేసును బదిలీ చేయాలా? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని, ఎన్‌ఐఏ కేసు దర్యాప్తు చేసి ఉంటే నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చామని సీఐఎస్‌ఎఫ్ పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరపున కేసు దర్యాప్తు పై కోర్టులో ఏపీ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ కేసు సెక్షన్(3) కిందకు రాదని ఏజీ తెలిపారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
ఇటీవల విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో, ఈ కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన ఓ అదనపు అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకి వస్తుందని, పౌర విమానయాన భద్రత చట్ట నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికారం ఎన్‌ఐఏకు ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment