పోలవరంపై ‘సోమా’ అప్పీల్ కొట్టివేత
- సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ సోమా జాయింట్ వెంచర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పిచ్చింది. మొదట అనర్హత జాబితాలో చేర్చిన కంపెనీలను తిరిగి అర్హత జాబితాలో చేర్చుతూ రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సోమా జాయింట్ వెంచర్ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మధుకాన్ జాయింట్ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. టెండర్ నిబంధనలను సడలించడాన్ని సవాలు చేస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మీ ఇన్‌ఫ్రా వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ, ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేస్తూ 2013 సెప్టెంబర్ 11న తీర్పు వెలువరించారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ సోమా జాయింట్ వెంచర్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. టెండర్ నిబంధనల విషయాలను తేల్చాల్సింది అధికారులేనని, ఇందులో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.