సిరిసిల్ల, న్యూస్‌లైన్ : అనుకున్నదే అయింది. నామినేటెడ్ కమిటీలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిన ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)కు త్రీమెన్ కమిటీని నామినేట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సెస్‌కు ఎన్నికలు నిర్వహించకుండా ఏడాదిన్నరగా నామినేటెడ్ కమిటీలను నియమిస్తుండడంతో హైకోర్టు జోక్యం చేసుకుని కొట్టివేస్తోంది. ఇప్పటికే మూడు కమిటీల నియామకాలను కోర్టు రద్దు చేయగా ప్రభుత్వం ఇటీవల సెస్ పర్సన్ ఇన్‌చార్జిగా కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, డెరైక్టర్లుగా పాత సత్యలక్ష్మి, పత్తిపాక లక్ష్మీరాజంను నామినేట్ చేస్తూ జీవో 1150 జారీ చేసింది. ఈ కమిటీ నియామకం చట్టవిరుద్ధమని సెస్ అసిస్టెంట్ హెల్పర్ల సంఘం మాజీ అధ్యక్షుడు డి.ప్రభాకర్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. విచారించిన కోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసింది.
మరోసారి ఎదురుదెబ్బ
సెస్ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించకుండా అధికార పార్టీ నాయకులను ప్రభుత్వం పదే పదే నామినేట్ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఆ కమిటీలను రద్దు చేస్తోంది. 2003లో దోర్నాల లక్ష్మారెడ్డి చైర్‌పర్సన్‌గా అప్పటి టీడీపీ ప్రభుత్వం నామినేట్ చేయగా నియామకాన్ని కోర్టు కొట్టివేసింది.
2007లో నాగుల సత్యనారాయణగౌడ్ చైర్మన్‌గా మరో తొమ్మిది మంది డెరైక్టర్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. దీనిపై అసిస్టెంట్ హెల్పర్ల సంఘం మాజీ అధ్యక్షుడు దుగ్యాల ప్రభాకర్‌రావు కోర్టును ఆశ్రయించడంతో ఆ నియామకాన్ని కోర్టు కొట్టివేసింది. మూడోసారి 2013 జూలైలో మళ్లీ నాగుల సత్యనారాయణగౌడ్‌ను సెస్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించగా, కోర్టు ఆయనను తొలగించాలని తీ ర్పునిచ్చింది. నాల్గోసారి ఇటీవల కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి పర్సన్ ఇన్‌చార్జిగా త్రీమెన్ కమిటీని నియమించ గా ఈ నియామకాన్ని కూడా కోర్టు రద్దు చేసింది.
రాజీ కుదిరినా..
పర్సన్ ఇన్‌చార్జి జగన్మోహన్‌రెడ్డితో ప్రభాకర్‌రావుకు రెండు రోజుల కిందటే రాజీ కుదిరింది. పర్సన్ ఇన్‌చార్జికి సలహాదారుగా ప్రభాకర్‌రావును త్రీమెన్ కమిటీ నియమించింది. దీంతో కేసు ఉపసంహరించుకుంటానని, సెస్ అభివృద్ధికి పాటుపడతానని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. కానీ, అప్పటికే హైకోర్టులో వేసిన పిటీషన్ మంగళవారం విచారణకు వచ్చి ఈ జీవో రద్దయింది.
ప్రభాకర్‌రావు త్రీమెన్ కమిటీతో రాజీ కావడంతో సిరిసిల్ల పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య త్రీమెన్ కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లినట్లు సమాచారం. మొత్తంగా హైకోర్టు వద్దంటున్నా ప్రభుత్వం నామినేటెడ్ కమిటీలను నియమిస్తూనే ఉంది. నాల్గోసారి నామినేటెడ్ త్రీమెన్ కమిటీ రద్దు కావడం సిరిసిల్ల సెస్ పరిధిలో చర్చనీయాంశమైంది. కోర్టు ఉత్తర్వులు మాత్రం ఇంకా సెస్ కార్యాలయానికి అందలేదు.
అప్పీల్ చేస్తాం..
కోర్టు తీర్పును గౌరవిస్తామని, ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని సెస్ పర్సన్ ఇన్‌చార్జి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. అప్పీల్‌కు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరిందని, ఈలోగా కోర్టులో అప్పీల్ చేసుకుని కమిటీ కొనసాగేలా ప్రయత్నిస్తామని తెలిపారు. కమిటీకి ఇంకా ఆరు నెలల సమయముందని పేర్కొన్నారు.
నాల్గో‘సారీ’
Published Thu, Sep 26 2013 4:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement
Advertisement